24 గంటల్లోనే ప్లేటు ఫిరాయించిన ‘పిల్లి’ దంపతులు

7 Feb, 2021 08:20 IST|Sakshi
అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులతో టీడీపీ నేతలు జ్యోతుల నవీన్, వర్మ, రామకృష్ణారెడ్డి

రాజీనామాలు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటన

తప్పు కప్పి పుచ్చుకునే ఎత్తుగడా!

అధిష్టానం సానుభూతి కోసమా!

ప్రశ్నిస్తున్న పార్టీ నాయకులు

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆడలేక మద్దెల ఓడు.. అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. పార్టీ సానుభూతిపరులను పోటీకి పెట్టలేని వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రభుత్వంపై అభాండాలు వేసి, తప్పించుకునే ఎత్తుగడలు వేస్తున్నారు. టీడీపీ కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సహా అన్ని పదవులకూ రాజీనామా చేస్తు న్నట్టు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆమె భర్త, పార్టీ ప్రధాన కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు) శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే పదవుల్లో కొనసాగుతామంటూ శనివారం వారు ప్లేటు ఫిరాయించారు. 24 గంటలుగా ఆ పారీ్టలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ‘తెలుగు’ డ్రామా బాగానే రక్తి కట్టినట్టు కనిపిస్తోంది. జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం అసలు పారీ్టలో ఏం జరుగుతోందని సీనియర్లను ప్రశ్నిస్తున్నారు. పదవుల నుంచి వైదొలగుతున్నామని, వెనక్కు తగ్గేది లేదని గంభీరంగా ప్రకటించిన సత్తిబాబు, అనంతలక్ష్మి దంపతులు.. తెల్లవారేసరికి నాలుక మడత పెట్టేయడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ నేతలు జ్యోతుల నవీన్, వర్మ, రామకృష్ణారెడ్డి బుజ్జగించేసరికి ప్లేటు ఫిరాయించేసే దానికి ఇంత హడావుడి దేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: టీడీపీ సేవలో బీజేపీ)

వ్యూహాత్మకంగానే హడావుడి!
పార్టీని విస్మరించారనే ఫిర్యాదు ఏడాది క్రితం అధిష్టానం వద్దకు వెళ్లినప్పుడే ఇన్‌చార్జిని మార్చాలనే ఆలోచన పై స్థాయిలో జరిగిందని చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మార్పు జరిగితే ఎదురయ్యే పరిణామాల దృష్ట్యా వేచి చూసే ధోరణికే పార్టీ మొగ్గు చూపింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల సమయంలో రూరల్‌లో ఉనికిని కాపాడుకోలేని దీనావస్థలోకి పార్టీ వెళ్లిపోయిందనే సమాచారం జిల్లా నేతల నుంచి హైకమాండ్‌కు మరోసారి వెళ్లింది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న బొడ్డు భాస్కర రామారావును పారీ్టలోకి ఆహ్వానించి, రూరల్‌ ఇన్‌చార్జిగా తీసుకోవాలని ప్రతి పాదనతో చినరాజప్ప మానసిక వేదనకు కారణమ య్యారని స్వయంగా సత్తిబాబే ప్రకటించారు. అయితే ఇన్‌చార్జిగా తమను తప్పిస్తారనే సంకేతాలతోనే ఆయన వ్యూహాత్మకంగా రాజీనామా డ్రామాకు తెర తీసి ఉండవచ్చనే చర్చ పార్టీ సీనియర్ల మధ్య జరుగుతోంది.(చదవండి: నిమ్మగడ్డకు జైలు శిక్ష తప్పదు)

తనంత తానుగా వైదొలగితే అధిష్టానం నుంచి లభించే సానుభూతి, తననే లక్ష్యంగా చేసుకుని చినరాజప్ప సాగిస్తున్న రాజకీయానికి ముగింపు పలికే వ్యూహంలో భాగం గానే రాజీనామా రచ్చ చేశారని అంటున్నారు. పనిలో పనిగా తన వైఫల్యాన్ని ప్రభుత్వంపై నెట్టేసే ఎత్తుగడ కూడా ఆయన వేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని గతంలో కాకినాడ రూరల్‌లో నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల పనులకు ఎడాపెడా మంజూరు ఇచ్చేశారు. తీరా ప్రభుత్వం మారేసరికి అడ్డగోలు పనులన్నింటిపైనా విచారణ జరుగుతున్న క్రమంలో బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ తరుణంలో వచ్చిన పంచాయతీ పోరులో పార్టీ సానుభూతిపరులను బరిలోకి దింపే సత్తా లేకే వెనకడుగు వేశారని, ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లడం తమ తప్పె లా అవుతుందని రాజప్ప వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పైగా కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌ పడడంతో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేసినంత మాత్రాన వాస్తవం తెరమరుగైపోదని చెబుతున్నారు.

గత వైరం కూడా ఉందనే వాదనలు
చినరాజప్ప, భాస్కర రామారావు మధ్య వైరం ఈనాటిది కాదు. పార్టీ ఆవిర్భావం నుంచీ భాస్కర రామారావు, దివంగత మాజీ మంత్రి మెట్ల సత్య నారాయణరావు ఒక వర్గంగా ఉండేవారు. నిమ్మకాయల చినరాజప్ప వైరివర్గంగా కొనసాగే వారు. భాస్కర రామారావు వర్గంలో పిల్లి సత్తిబాబు ముఖ్యుడిగా ఉండేవారు. అమలాపురం అసెంబ్లీ స్థానం జనరల్‌ కేటగిరీలో ఉన్నప్పుడు చినరాజప్ప దానిని ఆశించి భంగపడ్డారు. అప్పట్లో ఈ స్థానం మెట్లకే దక్కింది. అపμట్లో భాస్కర రామారావు పక్కదోవ పట్టించి టిక్కెట్టు దక్కకుండా చేశారనే ఆగ్రహం చినరాజప్పకు ఉంది. పార్టీ ఏదైనా వారిద్దరి మధ్య రాజకీయ వైరం ఇప్పటికీ అలానే ఉంది. తాజా పరిణామాల్లోకి చినరాజప్పను లాగడం వెనుక ఈ నేపథ్యం కూడా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. అలాగని చినరాజప్ప వైఖరిని కూడా పార్టీ నేతలు ఏ కోశానా సమరి్థంచడం లేదు సరికదా తప్పు పడుతున్నారు. బీసీ నాయకుడైన సత్తిబాబును ఇలా అప్రతిష్ట పాలుచేసి బయటకు పంపే కుట్రలు పన్నుతారా అని వారు ప్రశ్నిస్తున్నారు. సత్తిబాబు వైఫల్యం ఉంటే జిల్లా స్థాయిలో అందరినీ కూర్చోబెట్టి చెప్పాలే తప్ప ఇలా చినరాజప్ప కక్ష సాధింపునకు దిగుతారా అని భాస్కర రామారావుతో పూర్వాశ్రమంలో కలిసి ఉన్న తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పార్టీలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో తేలాలంటే మరికొన్ని రోజులు తెలుగు డ్రామాను ఆసక్తిగా చూడాల్సిందే.

టీడీపీ నేతల బుజ్జగింపులు
కాకినాడ రూరల్‌: టీడీపీ పదవులకు రాజీనామాలు ప్రకటించిన ఆ పార్టీ కాకినాడ రూరల్‌ ఇన్‌ చార్జి పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులను ఆ పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్, పిఠాపురం, అనపర్తి మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుజ్జగించారు. వారు శనివారం వాకలపూడిలోని అనంతలక్ష్మి దంపతుల నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు. దీంతో రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు అనంతలక్ష్మి దంపతులు ప్రకటించారు. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని, కొత్త ఇన్‌చార్జిని నియమించే వరకూ పదవిలో కొనసాగుతామని వెల్లడించారు. యనమల రామకృష్ణుడు శుక్రవారం రాత్రి తమతో మాట్లాడారని, ఆయనకు అన్నీ చెప్పామని సత్యనారాయణమూర్తి అన్నారు. పార్టీకి ఎవరు వచ్చినా పని చేస్తామని చెప్పారు. అధికారంలో ఉండగా చేపట్టిన పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఎంపీటీసీ, సర్పంచ్‌ అభ్యర్థులను పోటీకి పెట్టలేక పోయానని వివరించారు. పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. ఈ పరిణామాలు బాధాకరమని, ఇటువంటివి టీ కప్పులో తుపానులాంటివని జ్యోతుల నవీన్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు