-

Telangana Assembly Elections 2023: బరిలో ఎన్నారైలు.. వీళ్ల గురించి తెలుసా?

25 Nov, 2023 15:01 IST|Sakshi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు తమ ప్రత్యేకతను చాటుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే గీతారెడ్డి, చెన్నమనేని రమేష్‌ లాంటి ఎన్నారై బ్యాక్‌డ్రాప్‌ ఉన్న సీనియర్లు పూర్తిగా పోటీకి దూరం కాగా.. ఇప్పుడు కొత్తగా బరిలోకి దిగుతూ చర్చనీయాంశంగా మారారు కొందరు. 

మామిడాల యశస్వినీరెడ్డి

అమెరికాలో స్థిరపడిన ఝాన్సీరెడ్డి.. తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాలకుర్తి(జనగామ) నుంచి పోటీ చేయాలనుకున్నారు. అందుకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం చొరవ చూపి.. టికెట్‌ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె అమెరికా పౌరసత్వ కారణంతో అది వీలుపడలేదు. బదులుగా తన కోడలు యశస్వినిరెడ్డి(26)ని పోటీలో నిలిపాలనుకోగా.. కాంగ్రెస్‌ అధిష్టానం అందుకు ఒప్పుకుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత యువ అభ్యర్థి యశస్వినే కావడం విశేషం.

ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీరెడ్డి పాలకుర్తిలో పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై  ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్‌ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. పాల‌కుర్తిలో సేవాకార్యక్రమాల ద్వారా ఝాన్సీరెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఆ కార్యక్రమాలనే తన కోడలి ప్రచారం కోసం ఝాన్సీరెడ్డి ఉపయోగించుకుంది. ఇటీవలే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. గెలుపుపై యశస్విని ధీమాతో ఉంది.

చల్లా శ్రీలత

బీజేపీ హుజూర్‌ నగర్‌ అభ్యర్థిని చల్లా శ్రీలతారెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఆమె స్వస్థలం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించి.. ఆపై వివాహ తదనంతరం యూఏఈ వెళ్లిపోయారు. ఆమె భర్త విజయ భాస్కర్‌రెడ్డి అక్కడి ప్రభుత్వంలో సలహాదారుగా పని చేశారు. లాయర్‌గానే కాకుండా.. 2009 సమయంలో అబుదాబిలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు కార్యక్రమాలు శ్రీలత నిర్వహించారు. ఉద్యమానికి మద్దతుగా యూఏఈలో ఎన్నారై కమ్యూనిటీని కూడగట్టి సంఘీభావ కార్యక్రమాలు రూపొందించారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత.. స్వస్థలానికి వచ్చిన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గానూ ఆమె పని చేశారు. ప్రస్తుతం ఆమె నేరేడుచర్ల వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో ఈ మధ్య చేరిన ఆమె.. ఈసారి హుజూర్‌నగర్‌ బరిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్‌), సైదిరెడ్డి(బీఆర్‌ఎస్‌)లతో పోటీ పడుతున్నారు. స్థానికతే తనను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారామె. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి గతంలో విదేశాల్లో పనిచేస్తూ స్వదేశానికి వచ్చి రాజకీయ రంగప్రవేశం చేశారు.

భూక్యా జాన్సన్ నాయక్

ఖానాపూర్‌(నిర్మల్‌) బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూక్యా జాన్సన్‌ నాయక్‌. ఈయన చదివింది నిజాం కాలేజీలో. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్ ఈయన క్లాస్‌మేట్‌. అంతేకాదు.. గతంలో కేటీఆర్‌ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. అప్పటికే అక్కడ కంపెనీ నడుపుతున్న జాన్సన్‌ నాయక్‌ ఆతిథ్యం ఇచ్చారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త.. జాన్సన్‌ను రాజకీయాల్లోకి రప్పించింది. అలా.. ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రేఖా నాయక్‌ను(సీటు రాలేని ఆమె కాంగ్రెస్‌లో చేరారు) కాదని బరిలోకి దించారు.  ఈ సారి ఎన్నికల్లో తన ప్రియ మిత్రుడిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో కేటీఆర్ ఖానాపూర్ లో ఎన్నికల ప్రచారం సైతం చేశారు.

మధుయాష్కీ గౌడ్‌

ఎన్నారైల లిస్ట్‌లో సీనియర్‌ మోస్ట్‌ లీడర్‌. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన మధు యాష్కీ తొలిసారిగా..  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎల్బీ నగర్‌(రంగారెడ్డి) నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడ్డారు. గతంలో రెండుసార్లు(2004, 2009) నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యుడిగా ప్రజలు ఈయన్ని ఎన్నుకున్నారు. న్యాయ విద్యను అభ్యసించిన మధు యాష్కీ.. న్యూయార్క్‌లో లాయర్‌గా పని చేశారు. ఆయనకు న్యూయార్క్‌, అట్లాంటాలో లీగల్‌ కన్సల్టెన్సీలు ఉన్నాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల పరిణామాలు తనను సొంత దేశానికి రప్పించాయని తరచూ చెప్తుంటారాయన. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయినప్పటికీ.. ఎల్బీ నగర్‌ ఓటర్లను ఆయన ఏమేర ప్రభావితం చేస్తారనేది తెలియాలంటే కౌంటింగ్‌ దాకా ఆగాల్సిందే.

ఈసారి తెలంగాణ ఎన్నికల కోసం 2,780 ఎన్నారైలు ఓటేయబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక.. 2014లో ఎన్నారై ఓటర్ల సంఖ్య కేవలం 05గా ఉంది. అదే 2018లో ఈ సంఖ్య 244కి పెరిగింది. ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింది. వీరిలో 2,248 మంది పురుషులు, 531 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.

మరిన్ని వార్తలు