కేసీఆర్‌తో పొన్నాల దంపతుల భేటీ 

16 Oct, 2023 03:57 IST|Sakshi
సీఎం కేసీఆర్‌ కు పుష్పగుచ్ఛం అందిస్తున్న పొన్నాల దంపతులు

బీఆర్‌ఎస్‌లో చేరికపై నేడు నిర్ణయం.. జనగామ సభ వేదికగా పార్టీలోకి..

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దంపతులు.. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌కు వెళ్లిన పొన్నాల దంపతులను సీఎం కేసీఆర్‌ సాదరంగా ఆహ్వనించారు. పుష్పగుచ్ఛం అందజేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కె.కేశవరావు, జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడిన పొన్నాలను బీఆర్‌ఎస్‌లోకి రావాల్సిందిగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వనించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌తో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పొన్నాల వెల్లడించిన నేపథ్యంలో ఆదివారం కేసీఆర్‌తో జరిగిన భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

సోమవారం జనగామ నియోజకవర్గ కేంద్రంలో జరిగే బీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్, పొన్నాలను ఆహ్వనించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనగామ సభ వేదికగా పొన్నాల గులాబీ పార్టీలో చేరే అవకాశమున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు