Charanajit Singh Channi: గాడ్‌ ఫాదర్‌ లేరు.. అయితేనేం..

30 Jan, 2022 08:19 IST|Sakshi

పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ. ఆయన ఒక నిత్య విద్యార్థి. మూడు పీజీ డిగ్రీలున్న విద్యాధికుడు. చదువులోనైనా, రాజకీయాల్లోనైనా స్వయంకృషినే నమ్ముకున్నారు. కెప్టెన్‌ అమరీందర్‌ నిష్క్రమణతో ఆయనకి అనుకోకుండా పంజాబ్‌ అత్యున్నత పీఠం అధిష్టించే అవకాశం వచ్చింది. విద్యార్థిగా ఉన్నప్పుడే చన్నీ రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. రాజకీయ రంగంలో గాడ్‌ ఫాదర్‌ ఎవరూ లేనప్పటికీ  ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు సంపాదించారు చదువుకోవడం, ప్రజలతో కలిసి తిరగడం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలు. ముఖ్యమంత్రి అయిన ఈ  కొద్ది రోజుల్లోనే నిరుపేదల సీఎం అన్నపేరు తెచ్చుకోవాలన్న ఆశతో అడుగులేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ  సీఎం అభ్యర్థిగా నవజోత్‌ సింగ్‌ సిద్ధూతో పోటీపడుతున్న చన్నీకి కూడా ప్రజల్లో మంచి ఆదరణే ఉంది.  

పంజాబ్‌లో చంకూర్‌ సాహిబ్‌ జిల్లాలోని మకరోనా కలన్‌ గ్రామంలో ఒక దళిత కుటుంబంలో 1963 సంవత్సరం మార్చి 1న జన్మించారు.  
చన్నీకి చదువంటే ప్రాణం. మూడు పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీలు చేశారు. రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ కూడా చదువుకున్నారు.  
చదువుకి వయసుతో పని లేదని నమ్మడమే కాదు ఆచరించి చూపించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎంబీఏ చదివారు. 2016లో సీఎల్పీ నాయకుడిగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూనే పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేశారు.  
చన్నీ తండ్రి హర్షసింగ్‌ ఖరార్‌ గ్రామ సర్పంచ్‌గా ఉండడంతో ఆయన ప్రభావంతో రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు.  
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. చండీగఢ్‌ గురుగోవింద సింగ్‌ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నప్పుడే యూనియన్‌ నాయకుడిగా ఎన్నికయ్యారు. 2002లో ఖరార్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు.  
చన్నీ భార్య కమల్‌జిత్‌ కౌర్‌ డాక్టర్‌. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.  
2007 సంవత్సరంలో తొలిసారిగా పంజాబ్‌ శాసనసభకు చంకూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు.  
2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ పడి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  
2015లో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఏడాది పాటు సమర్థవంతమైన పాత్ర పోషించారు. 
2017లో జరిగిన ఎన్నికల్లో చంకూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కెప్టెన్‌ అమరీందర్‌ నేతృత్వంలో సాంకేతిక విద్య మంత్రిగా వ్యవహరించారు. 
అమరీందర్‌ సింగ్‌ సీఎం పదవికి రాజీనామా చేసి, పార్టీని వీడటంతో చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ 2021 సెప్టెంబర్‌లో పంజాబ్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. 
ఈసారి ఎన్నికల పోలింగ్‌కు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించమని చన్నీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం చన్నీ, సిద్ధూల మధ్య ఈ పదవి కోసం పోటీ ఉంది. ఎవరి పేరు ప్రకటించినా అందరూ సమష్టిగా కలిసి పని చేస్తామంటూ ఇరువురు నాయకులు రాహుల్‌కు హామీ ఇవ్వడం విశేషం.  
పంజాబ్‌లో దాదాపుగా 32 శాతం దళిత జనాభా ఉంది. ఈ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొనే దళితుడైన చన్నీని కాంగ్రెస్‌ అధిష్టానం పంజాబ్‌ సీఎంగా నియమించింది.  
ఆమ్‌ ఆద్మీ పార్టీ తరహాలో పంజాబ్‌ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలని రాహుల్‌ గాంధీ అనుచరుడు నిఖిల్‌ ఆల్వా ట్విట్టర్‌లో పోలింగ్‌ నిర్వహించగా చన్నీకి అనుకూలంగా ఏకంగా 69 శాతం ఓట్లు వచ్చాయి. 
యువతని ఆకట్టుకోవడానికి సీఎం చన్నీ ప్రయత్నిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏడాదిలోనే యువతకి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశాలకు వెళ్లేందుకు ఉచితంగా శిక్షణ, ఉన్నత విద్యాభ్యాసానికి రుణం లేని వడ్డీలు వంటి హామీలెన్నో ఇచ్చారు.  
రాష్ట్రంలో దళితుల్ని ఆకర్షించడానికి గురు రవిదాస్‌ బోధనల్ని ప్రచారం చేయడం కోసం అతి పెద్ద కేంద్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.  
సీఎం పదవిని చేపట్టిన మూడు నెలల్లోనే పాలనలో తన ముద్ర వేశారు. కేవలం మూడు నెలల్లోనే 60కి పైగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దళితుడైనప్పటికీ ఆ సామాజిక కార్డు తీయకుండా తాను పేదల సీఎం అన్న ముద్ర వేయించుకోవాలన్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి కూలీల సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఆటో రిక్షా డ్రైవర్లను పలకరించడం, గురుద్వారకు వెళ్లి అక్కడి వారితో కలిసి భక్తి పాటలు పాడడం వంటివి చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు.  
– నేషనల్‌ డెస్క్, సాక్షి 

మరిన్ని వార్తలు