Amarinder Singh: సిద్ధు ట్వీట్లు.. నేడు ఢిల్లీకి సీఎం

10 Aug, 2021 11:56 IST|Sakshi
జూలైలో పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో సీఎం అమరీందర్‌

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు మధ్య విభేదాలు ఇంకా సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. సిద్ధుకు రాష్ట్ర నాయకత్వ పగ్గాలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమరీందర్‌ సింగ్‌.. ఆ తర్వాత అధిష్టాన నిర్ణయంతో ఏకీభవించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలన్న సిద్ధు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఆయనతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు.

అయితే, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు మాత్రం మరోసారి అమరీందర్‌ సర్కారును ఇరుకునపెట్టేలా వరుస ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది. డ్రగ్స్‌ వ్యవహారంపై పంజాబ్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందంటూ సిద్ధు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు.. ‘‘పంజాబ్‌ పోలీసులు ఏం చేస్తున్నారు? మాదక ద్రవ్యాల సరఫరా కట్టడికై ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుంది? స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న ఏడీజీపీ హర్‌ప్రీత్‌ సిద్ధు 2018 ఫిబ్రవరిలో పంజాబ్‌, హర్యానా హైకోర్టులో డ్రగ్స్‌ విషయమై స్టేటస్‌ రిపోర్టు ఫైల్‌ చేశారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రెండేళ్లలో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు.

ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. పారదర్శకంగా ముందుకు సాగాలి. సదరు నివేదికను పబ్లిక్‌ డొమైన్‌లోకి తీసుకురండి’’ అని నవజోత్‌ సింగ్‌ సిద్ధు డిమాండ్‌ చేశారు. కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, అదే విధంగా ఇండో- పాక్‌ సరిహద్దులో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు అమరీందర్‌ సింగ్‌ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సిద్ధు ఈ మేరకు ట్వీట్లు చేయడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు