ఉంటుందా? పోతుందా?

7 Dec, 2023 01:17 IST|Sakshi

రిటైర్డ్‌ అధికారుల్లో గుబులు 

ఏళ్ల తరబడి సర్వీసుల పొడిగింపు 

రిటైర్డ్‌ అధికారుల కొనసాగింపుపై గతంలో తీవ్ర విమర్శలు చేసినరేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌ :  పలు కీలక శాఖల్లో ఏళ్ల తరబడి కొనసాగిన రిటైర్డ్‌ అధికారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో వీరికి కొనసాగింపు ఉంటుందా..?  సాగనంపుతారా ? అంటూ అప్పుడే చర్చ మొదలైంది. విద్యుత్, నీటిపారుదల, ఆర్థిక శాఖ, ఆర్‌అండ్‌బీ, మిషన్‌ భగీరథ, జలమండలి, పౌరసరఫరాలు, మెట్రో రైలు వంటి కీలక ప్రభుత్వశాఖలు, విభాగాల్లో ఇంతకాలం ఉద్యోగ విరమణ చేసిన వారంతా పెత్తనం చేశారు. అయితే రిటైర్డ్‌ అధికారులను కీలక పోస్టుల్లో కొనసాగించడంపై రేవంత్‌రెడ్డి గతంలోనే తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వీరి విషయంలో ఆయన తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

విద్యుత్‌ సంస్థల్లో రాష్ట్రఆవిర్భావం నుంచి వారే..
తెలంగాణ జెన్‌కో సీఎండీగా 2014 జూన్‌ 6 నుంచి, అదే ఏడాది అక్టోబర్‌ 25 నుంచి ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతల్లో దేవులపల్లి ప్రభాకర్‌రావు కొనసాగారు. ఎన్నికల ఫలితాలొచ్చాక మరుసటి రోజే ఆయన రెండు పోస్టులకు రాజీనామా చేయగా, ఇంకా కొత్త వారిని నియమించలేదు.

2014 జూలై నుంచి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా జి.రఘుమారెడ్డి,  2016 అక్టోబర్‌ నుంచి టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎండీగా ఎ.గోపాల్‌రావు వ్యవహరిస్తున్నారు. విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లలో అత్యధికశాతం మంది తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి కొనసాగుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు సీఎండీలు, డైరెక్టర్లు కొనసాగుతారని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది.

ఈఎన్‌సీలు..
నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు 2011లో ఉద్యోగ విరమణ చేసినా ఇంకా కొనసాగుతున్నారు. రామగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సీఈ హమీద్‌ ఖాన్, అంతర్రాష్ట్ర వ్యవహారాల ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు రిటైర్మెంట్‌ తర్వాత కూడా కొనసాగుతున్నారు.

2016 జూలైలో ఉద్యోగ విరమణ చేసిన హైదరాబాద్‌ జలమండలి ఈఎన్‌సీ/ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.సత్యనారాయణరెడ్డి, 2017 నవంబర్‌లో ఉద్యోగవిరమణ చేసిన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎస్‌సీ కృపాకర్‌రెడ్డి,  ఆర్‌అండ్‌బీలో 2016 జూలైలో రిటైర్డ్‌ అయిన ఈఎన్‌సీ పి.రవీందర్‌రావు, 2017 ఫిబ్రవరిలో రిటైర్డ్‌ అయిన బి.గణపతి రెడ్డి, ఈఎన్‌సీ (స్టేట్‌ రోడ్లు) ఇంకా కొనసాగుతున్నారు. 

ఆ అధికారుల్లో చిగురించిన ఆశలు
గత ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులున్న కొందరు అధికారుల విషయంలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తొలుత రెండేళ్ల కాలానికి సర్వీసు పొడిగించారు. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకోసారి పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చేవారు. చివరకు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు(అన్‌టిల్‌ ఫర్‌దర్‌ ఆర్డర్‌) ఆ అధికారులే ఆయా పోస్టుల్లో కొనసాగుతారని జీఓలు సైతం జారీ చేశారు.

రిటైర్డ్‌ అధికారులే కీలక పోస్టుల్లో కొనసాగుతుండడంతో సీనియారిటీ ప్రకారం అందాల్సిన అవకాశాలు కోల్పోతున్నామని సర్వీసు మిగిలి ఉన్న అధికారులు చాలా ఏళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. కొత్త సర్కారు వచ్చిన నేపథ్యంలో రిటైర్డ్‌ అధికారులను ఇంటికి పంపిస్తే తమకు అవకాశాలు లభిస్తాయన్న ఆశతో ఉన్నారు. 

అ‘విశ్రాంత’ సేవలోమరికొందరు 
ఉద్యానవన శాఖ డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి 2017 నవంబర్‌లో రిటైర్డ్‌ కాగా ఇంకా కొనసాగుతున్నారు. దేవాదాయ శాఖ కార్యదర్శి/ కమిషనర్‌గా ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి అనీల్‌కుమార్‌ మూడేళ్లుగా కొనసాగుతుండగా, ఆయన పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌గా రాజమౌళిని సైతం పునర్నియమించారు.

ఇక పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అదర్‌ సిన్హా , యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్, శిల్పారామం ప్రత్యేకాధికారిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ కిషన్‌రావు, మెట్రో రైలు ఎండీగా రిటైర్డ్‌ ఐఆర్‌ఏఎస్‌ అధికారి ఎన్వీఎస్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ఓఎస్డీగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ చాలా ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారిగా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి రవీందర్,  గజ్వేల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అధికారి ముత్యంరెడ్డి సైతం రిటైర్మెంట్‌ తర్వాత కూడా అవే పోస్టుల్లో ఉన్నారు.  

>
మరిన్ని వార్తలు