కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలోకి కీలక నేత

19 Jan, 2023 07:50 IST|Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, పంజాబ్‌ మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘అంతర్గత కుమ్ములాటలు, ఫ్యాక్షనిజంతో నిండిన కాంగ్రెస్‌లో ఉండలేను. మోదీ సర్కార్‌ హయాంలో దేశం ప్రపంచంలో దౌత్యపరంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించింది’ అని బీజేపీలో చేరాక బాదల్‌ వ్యాఖ్యానించారు. తన రాజీనామా లేఖను రాహుల్‌ గాంధీకి పంపించారు.

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ తమ్ముడి కుమారుడైన మన్‌ప్రీత్‌ బాదల్‌ తన పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌ను కాంగ్రెస్‌లో కలిపేస్తూ ఏడేళ్ల క్రితం ఆ పార్టీలో చేరారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన పార్టీని వీడటంపై కాంగ్రెస్‌ స్పందించింది. ‘పార్టీపై కమ్మిన మేఘాలు(బాదల్‌) తొలగిపోయాయి’ అంటూ వ్యాఖ్యానించింది. అధికార దాహంతోనే ఆయన బీజేపీలో చేరారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు.
చదవండి: బీజేపీది రెండు నాల్కల వైఖరి: మమత

మరిన్ని వార్తలు