జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లే 

22 Mar, 2023 04:28 IST|Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరినా పవన్‌ కళ్యాణ్‌ స్పందించలేదు 

బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఇదే అంశంపై సుదీర్ఘ చర్చ  

సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ మాధవ్‌ నోటా ఇదే మాట 

క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసే స్థితిలేనప్పుడు పొత్తు ఉండి ప్రయోజనం ఏంటని ప్రశ్న   

పొత్తు కొనసాగాలని బీజేపీ కోరుకుంటోందని వెల్లడి 

కలిసి పనిచేస్తే టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు బీజేపీ–జనసేనే ప్రత్యామ్నాయం  

మేం నమ్ముతున్నాం.. పవన్‌కళ్యాణ్‌ కూడా నమ్మాలి అంటూ సూచన  

సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర పట్టభద్రుల (గ్రాడ్యుయేట్‌) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న తనకు మద్దతుగా బహిరంగ ప్రకటన చేయాలని స్వయంగా మిత్రపక్ష జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను కోరినా ఆయన స్పందించలేదని.. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసే పరిస్థితి లేనప్పుడు బీజేపీ–జనసేన కలిసి ఉన్నా లేనట్లే అని శాసనమండలిలో బీజేపీ పక్ష నాయకుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌ ఘాటుగా స్పందించారు.

పొత్తులో కొనసాగుతున్నప్పటికీ జనసేన ఎక్కడా బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపని అంశంపై మంగళవారం విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జిల సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో కేంద్ర పార్టీ నుంచి జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌ పాల్గొన్నారు.

సమావేశంలో చర్చించిన అంశాలను మాధవ్‌తో పాటు మరో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, పార్టీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు జనసేనతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం ఉంది. ఇటీవల పవన్‌ కూడా జనసేన–బీజేపీ పొత్తు ఉంది అన్నారు.

అయితే, క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదన్నది వాస్తవం. నిజంగా పొత్తులో ఉంటే క్షేత్రస్థాయిలో కూడా కలిసి పనిచేయాలని కోరుతున్నాం. ఆ విధంగా వెళ్తేనే ప్రజలలో మనం కలిసి వెళ్తుతున్నామన్న మాటకు అర్థం ఉంటుంది. నామ్‌కే వాస్త్‌గా పొత్తుతో ఉపయోగం లేదని మా అందరి అభిప్రాయం’.. అని మాధవ్‌ వ్యాఖ్యానించారు.
 
ఇప్పటికీ పొత్తు కొనసాగాలనే కోరుకుంటున్నాం.. 
‘బీజేపీ–జనసేన కలిసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ ఇప్పటికీ కోరుకుంటోంది. కలిసి పనిచేస్తే ప్రజా మద్దతు రెండు పార్టీలకు ఉంటుంది. ఆయనా (పవన్‌) నమ్మాలి. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రకటన చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు.

పోటీలో ఉన్న అభ్యర్థిగా నేనూ అడిగాను. చాలాసార్లు కోరాం. కానీ, ప్రకటన రాలేదు. మరోవైపు.. ఉత్తరాంధ్రలో పీడీఎఫ్‌ అభ్యర్థి తమకు జనసేన  మద్దతు ఉందని ప్రచారం చేసుకున్నారని, దానిని ఖండించమని కోరినా ఖండించలేదు’.. అని మాధవ్‌ చెప్పారు. కలిసి పనిచేసే విషయంలో బీజేపీ నుంచే స్పందనలేదని పవన్‌కళ్యాణ్‌ అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆయన వైపు నుంచే స్పందనలేదు’ అని బదులిచ్చారు.  

అందుకే సొంతంగా ఎదగాలనినిర్ణయించుకున్నాం.. 
‘జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం నేపథ్యంలో పార్టీ తనంతట తాను ఎదిగేలా అన్ని ఏర్పాట్లుచేసుకోవాలని అనుకున్నాం. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 1–14 వరకు బూత్‌ స్వశక్తీకరణ అభియాన్‌ కార్యక్రమం చేస్తున్నాం. మే ఒకటి తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు వేసే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. ఏదైనా పొత్తు నిర్ణయం ఉంటే కేంద్ర పార్టీ ఆలోచిస్తుంది’ అని మాధవ్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు