నేడు రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంక

18 Oct, 2023 02:56 IST|Sakshi

ఆరు గ్యారంటీల మేనిఫెస్టోకు ఆలయంలో పూజలు   

అక్కడి నుంచి రామాంజాపూర్‌లో నిర్వహించే మహిళా విజయభేరి సభకు

రాత్రి భూపాలపల్లిలో బస చేయనున్న రాహుల్‌ 

సాక్షి, హైదరాబాద్‌/వెంకటాపురం(ఎం): మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు రానున్న ఏఐసీసీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాకు చెప్పారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రాహుల్, ప్రియాంక పాలంపేటకు చేరుకుంటారన్నారు.

అక్కడినుంచి కాన్వాయ్‌లో 4:15 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకొని కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను వారు రామలింగేశ్వరుడి ముందు పెట్టి పూజలు చేస్తారని తెలిపారు. శివుడిపై రాహుల్, ప్రియాంకతోపాటు తనకూ విశ్వాసం ఉందన్నారు. అనంతరం 4:45 గంటలకు ఆలయం నుంచి బస్సుయాత్ర ద్వారా రామాంజాపూర్‌లో ఏర్పాటుచేసిన మహిళా విజయభేరి సభా ప్రాంగణానికి బయలుదేరుతారు. అక్కడ రాహుల్, ప్రియాంక మహిళలను ఉద్దేశించి ప్రసంగించి, మహిళా డిక్లరేషన్‌ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారు.

సభ అనంతరం ప్రియాంక ఢిల్లీకి పయనం కానుండగా, రాహుల్‌ బుధవారం రాత్రి భూపాలపల్లిలో బస చేస్తారు. రాహుల్‌ గురువారం ఉమ్మడి కరీంనగర్, శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల్లో బస్సుయాత్ర సాగించనున్నారు. దసరా సెలవుల తరువాత రాహుల్‌ మలి దశ బస్సుయాత్ర ఉంటుంది. కాగా, రాహుల్, ప్రియాంక పర్యటన సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మంగళవారం రామాంజాపూర్‌ సభాస్థలిని పరిశీలించారు. మహిళా విజయభేరికి పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు