అఫీషియల్‌ ప్రకటన: పరాభవం పాలైన చోటు నుంచే రాహుల్ గాంధీ పోటీ

18 Aug, 2023 17:07 IST|Sakshi

లక్నో: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో దేశ రాజకీయాలు కూడా మెల్లమెల్లగా వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేధీ నుంచే మళ్లీ పోటీ చెయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూపీ కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు. 

2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేశారు. ఒకటి యూపీలోని అమేధీ కాగా.. రెండోది కేరళలోని వయనాడ్. అయితే.. అమేధీలో ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో దాదాపు 55 వేల ఓట్లతో ఓడిపోయిన రాహుల్ గాంధీ.. వయనాడ్‌లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అయితే.. గత ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని యూపీ కాంగ్రెస్ దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.  

మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల కేసులో తన పదవిని కోల్పోయిన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇటీవలే మళ్లీ  పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంలోనూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రెండోసారి భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలను ఆకట్టుకోవాలని సంకల్పంతో ఉ‍న్నారు. ఈ నేపథ్యంలో అమేథీ నుంచే రాహుల్ గాంధీ మళ్లీ పోటీ చేయనున్నారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

ఇదీ చదవండి: మణిపూర్‌లో రెండు వారాల తర్వాత మళ్లీ చెలరేగిన హింస.. కాల్పుల్లో ముగ్గురి మృతి

మరిన్ని వార్తలు