నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై రాహుల్‌ ఫైర్‌

31 Aug, 2020 14:48 IST|Sakshi

చిన్న పరిశ్రమలను చిదిమేస్తున్నారని ఆందోళన

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సోమవారం మరోసారి నరేంద్ర మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు, లాక్‌డౌన్‌, జీఎస్టీ నిర్ణయాలతో అసంఘటిత రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ‘40 ఏళ్లలో తొలిసారిగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం ఎదుర్కొంటోంది..ఇది ఈరోజు వెల్లడైన జీఎస్టీ గణాంకాల్లో నిర్ధారించబడినా సత్యానికి కట్టుబడలేనివారు దేవుడిపై నెపం నెడుతున్నార’ని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గతవారం చేసిన దైవ ఘటన (యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌) వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 2008లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆర్థిక సునామీ దేశాన్ని ముంచెత్తకుండా కాపాడిందని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో అమెరికా, యూరప్‌, చైనా, జపాన్‌ వంటి అగ్రదేశాలు సమస్యల్లో కూరుకుపోయాయని, అమెరికాలో బ్యాంకులు దెబ్బతిని వాణిజ్య సంస్థలు మూతపడితే భారత్‌లో మాత్రం ప్రతికూల ప్రభావం లేదని రాహుల్‌ పేర్కొన్నారు. చదవండి : కాంగ్రెస్‌లో నాయకత్వ చర్చ : శివసేన కీలక వ్యాఖ్యలు

ఆ సమయంలో తాను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను కలిసి ప్రపంచమంతా మాంద్యంలో కూరుకుపోతే భారత్‌ ఎందుకు ప్రభావితం కాలేదని అడిగానని చెప్పారు. మన్మోహన్‌ బదులిస్తూ భారత్‌లో బడా సంస్ధలతో కూడిన వ్యవస్థ, చిన్నమధ్యతరహా పరిశ్రమలు, రైతులతో కూడిన అసంఘటిత వ్యవస్థ అంటూ రెండు ఆర్థిక స్వరూపాలు ఉన్నాయని, అసంఘటిత వ్యవస్థపై ప్రభావం లేనంతవరకూ భారత్‌ పట్టు కోల్పోదని అన్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగాన్ని నిర్వీర్యం చేసి వారి నుంచి డబ్బును గుంజేయాలని చూస్తోందని ఆరోపించారు. ఫలితంగా భారత్‌ ఉద్యోగాలు సృష్టించలేని పరిస్థితి ఎదురైందని, దేశంలో 90 శాతం ఉద్యోగాలు అసంఘటిత రంగం నుంచే సమకూరుతున్నాయని గుర్తెరగాలన్నారు. ‘ఈ దేశాన్ని ముందుకు నడిపించే మీపై కుట్ర జరుగుతోంది..మిమ్మల్ని మోసగించి బానిసలుగా మార్చాలని చూస్తున్నారు..ఈ దాడిని మనం పసిగట్టి వీరి నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలు చేయాల’ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో ప్రజలను ఉద్దేశించి రాహుల్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు