శంకుస్థాపనకు రాజకీయ రంగు పులుముతున్నారు

11 Dec, 2020 15:20 IST|Sakshi

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేతలు దేవినేని ఉమ, పరిటాల సునీత, శ్రీరామ్‌లు మూడు రిజర్వాయర్ల శంకుస్థాపనకు రాజకీయ రంగు పులుముతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హంద్రీ నీవా పనులు ప్రారంభించారని, జీడిపల్లి అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ టీడీపీ హయాంలో చేపట్టారని చెప్పారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరుకి నీళ్లు ఇవ్వాలని తాను, అనేక మంది రైతులు కోరామని, అప్పటి సీఎం వైఎస్సార్‌ను కలిసి నివేదించామని తెలిపారు. ఆ వెంటనే స్పందించిన వైఎస్సార్ 2009 ఎన్నికల సభలో పేరూరు డ్యాంకు నీరిస్తామని ప్రకటించారన్నారు. ఆయన మరణం తర్వాత ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. శుక్రవారం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికలకి ముందు ఏడాది 2018లో చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఎన్నికలకు ఒక నెల ముందు పనులు ప్రారంభించారు. పేరూరు డ్యాంకి పైసా ఖర్చు లేకుండా నీరివ్వవచ్చని చెప్పినా పట్టించుకోలేదు. ఆనాడు అంచనాలు పెంచుకుని దోచుకునే ప్రయత్నం చేశారు.

మేము అధికారంలోకి వచ్చాక విచారణ చేయించాము. 200 కోట్ల రూపాయల మిగులు కనిపించింది. ఆ నిధులతో మరొక రిజర్వాయర్ చేపట్టాము. వాస్తవాలు తెలియకుండా విమర్శలు చేస్తున్నారు. దేవినేని ఉమా చిత్తశుద్ధితో మాట్లాడాలి. అంచనాలు పెంచుకున్నప్పుడు మీరెక్కడికి వెళ్లారు. దోపిడీకి అంచనాలు పెంచుకున్నారా..?. సీఎం జగన్‌ నిధులు దుర్వినియోగం కాకుండా కరువు ప్రాంతానికి నీరిస్తున్నారు. ఆయన లక్ష ఎకరాలకు నీళ్లిస్తున్నారు. మీరు శంకుస్థాపనలు చేసిన వాటిని మా వైఎస్సార్ ముందుకు నడిపించారు. రాయలసీమకు సాగు నీరు అందించే దిశగా మేము ముందుకి వెళ్తున్నాం. పరిటాల రవి చనిపోయిన తర్వాత జలయజ్ఞం ప్రారంభమైంది. అది ఏ విధంగా పరిటాల రవి కల అవుతుంది?’’ అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు