ఇద్దరూ ఒకేసారి శాసనసభ పక్ష నేతలుగా... 

2 Nov, 2023 03:13 IST|Sakshi

‘చెన్నమనేని’ బ్రదర్స్‌ పేరిటఅరుదైన రికార్డు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: చెన్నమనేని రాజేశ్వర్‌రావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వారిద్దరూ ఉమ్మడి శాసనసభలో కరీంనగర్‌ జిల్లాలో వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికవ్వడం, భిన్న ధ్రువాలు, విభిన్న సిద్ధాంతాలతో  సీపీఐ, బీజేపీల నుంచి ప్రాతినిథ్యం వహించడం, శాసనసభలో సభాపక్ష నేతలుగా ఉండటం ఎప్పటికీ  ఓ రికార్డే. 

చెన్నమనేని రాజేశ్వర్‌రావు 1957లో చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిరిసిల్ల నియోజక వర్గం నుంచి 1967, 1978, 1985, 1994 ఎన్నికల్లో సీపీఐ నుంచి, 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  
 ఆయన సోదరుడైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1985,1989,1994 ఎన్నికల్లో బీజేపీ నుంచి మెట్‌పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కరీంనగర్‌ ఎంపీగా 1998, 1999 ఎన్నికల్లో రెండుమార్లు ఎంపికై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆనంతరం మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. 
1994 నుంచి 1999 మధ్యకాలంలో ఉమ్మడి శాసనసభలో బీజేపీ శాసనసభ పక్షనేతగా సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, సీపీఐ శాసనసభ పక్షనేతగా సీహెచ్‌ రాజేశ్వర్‌రావు ఉన్నారు. అసెంబ్లీలో కాషాయదళపతిగా విద్యాసాగర్‌రావు, ఎరుపుదళానికి నాయకుడిగా రాజేశ్వర్‌రావు తమ పార్టీల వాణిని ఆయా సందర్భాల్లో బలంగా వినిపించారు. ఒకరి విధానాలను మరొకరు ఖండించి ఎండగట్టారు. ఎదుట నిలుచుంది సోదర బంధం, రక్త సంబంధమైనా విధానాలపరంగా ఒకరినొకరు విరుద్ధ వేదికలపై నిలిచారు. విధానాలపరంగా పరస్పరం ఎదుటి పార్టీలో ఉన్న సోదరుడిని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు ఏనాడూ వెనకడుగు వేయని అరుదైన సందర్భాలు వీరిద్దరి హయాంలో అనేకమున్నాయ.   

మరిన్ని వార్తలు