కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చేయాలి

25 Oct, 2023 04:33 IST|Sakshi

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌

పోలీసుల సాయంతో మళ్లీ ఓడించేందుకు కుట్రపన్నారని ఆరోపణ

తన హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగినట్లు వెల్లడి

కొడంగల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం ఆయన కొడంగల్‌కు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి నివాసానికి వెళ్లి దేశ్‌ముఖ్‌ కుటుంబ సభ్యులకు జమ్మి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై తన నివాసానికి చేరుకొని అభిమానులు, పార్టీ శ్రేణులతో ముచ్చటించారు.

అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన అన్ని ప్రభుత్వ భవనాలను తానే మంజూరు చేయించినట్లు చెప్పారు. 2018లో పోలీసులను అడ్డు పెట్టుకొని తనను ఓడించారని, ఇప్పుడు కూడా పోలీసుల సాయంతో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

కొడంగల్‌కు కేసీఆర్‌ అన్యాయం
అన్ని విషయాల్లోనూ సీఎం కేసీఆర్‌ కొడంగల్‌ నియోజకవర్గానికి అన్యాయం చేశారని రేవంత్‌ ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి సాగునీరు తెచ్చి రైతుల కాళ్లు కడుతానని కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్‌ ప్రశ్నించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ ఊసేలేదని మండిపడ్డారు.

కొడంగల్‌ను కేసీఆర్‌ రెండు ముక్కలు చేసి పాలనాపరమైన ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. ఉద్యోగులంతా ఏకమై కేసీఆర్‌ను ఇంటికి పంపాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు నెలకు రూ.4 వేలు ఇస్తామని, కేసీఆర్‌ చేసిన రుణమాఫీ బ్యాంకుల మిత్తీకి కూడా సరిపోలేదన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గంలోని 8 మండలాల నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు