రాజస్తాన్‌ కమలంలో వర్గపోరు ! 

9 Mar, 2021 13:05 IST|Sakshi

ఫలించని జేపీ నడ్డా దౌత్యం

దేవ్‌దర్శన్‌ యాత్రతో అధిష్టానానికి సవాలు విసిరేందుకు సిద్ధమైన వసుంధరా రాజే

పార్టీలో సరైన అవకాశం కల్పించట్లేదంటూ సింధియా వర్గ ఎమ్మెల్యేల ఫిర్యాదు

సమాంతర రాజకీయాలు చేస్తున్నారని పునియా వర్గం ఆరోపణలు

సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్‌ కమలదళంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్ర పార్టీ నిర్ణయాలను పెడచెవిన పెడుతూ కీలక నిర్ణయాల్లోనూ తమ అభిప్రాయాలను తీసుకోవట్లేదంటూ వసుంధరా రాజే వర్గ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. నాయకుల మధ్య ఉన్న వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా రంగంలోకి దిగారు. రాష్ట్ర నాయకుల మధ్య పెరుగుతున్న వర్గపోరు, అసమ్మతితో పాటు విబేధాలను తగ్గించేందుకు నడ్డా రాజస్థాన్‌లో పర్యటించారు. రాష్ట్రంలోని నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను మరచి ఐక్యంగా ఉండాలని నడ్డా ఇచ్చిన సందేశం కాస్తా గాలికి కొట్టుకుపోయినట్లు కనిపిస్తోంది. నడ్డా పర్యటన ప్రభావం రాష్ట్ర నాయకుల మధ్య కనిపించకపోగా, వర్గపోరు మరింత పెరిగేందుకు కారణంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

శిబిరాలుగా విడిపోతూ... 
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే వర్గం ఒకవైపు, ఆమె ప్రత్యర్థి, బీజేపీ రాజస్తాన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పునియా, ప్రతిపక్ష నాయకుడు గులాబ్‌ చంద్‌ కటారియా, ఉప నాయకుడు రాజేంద్ర రాథోడ్‌ శిబిరాలుగా విడిపోయినట్లు కనిపించింది. శాసనసభలో పార్టీ విప్‌ను నియమించాలని వసుంధర రాజే చేసిన విజ్ఞప్తిని పునియా, కటారియా, రాథోడ్‌ పట్టించుకున్న దాఖలాలు లేవు. గత రెండున్నరేళ్ళుగా ఖాళీగా ఉన్న విప్‌ పదవిని భర్తీ చేయాలని రాజే కోరుతున్నారు. అయితే పార్టీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా పునియా, కటారియా అందుకు సిద్ధంగా లేరు.


రాష్ట్ర నాయకులు అందరూ కలిసి పనిచేయాలని జేపీ నడ్డా ఇచ్చిన సందేశాన్ని ఖాతరు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా దేవ్‌ దర్శన్‌ యాత్రకు వసుంధరా రాజే శిబిరం సిద్ధమైంది. నడ్డా పర్యటన ముగిసిన తర్వాత వసుంధర యాత్రకు దూరంగా ఉండా లని పునియా, రాథోడ్, కటారియాలు తమ వర్గ అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించారు. వసుంధర యాత్రకు దూరంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా స్థాయి కార్యాలయాలకు ఇప్పటికే సమాచారాన్ని అందించారని పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. 

ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నాయకులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పైకి ఎత్తినప్పటికీ, వారి మధ్య ఉన్న దూరం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైంది. రెండున్నరేళ్ళ క్రితం సీఎం పేరు ప్రకటన విషయంలో అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్‌లను దగ్గరికి చేస్తూ రాహుల్‌ గాంధీ బలవంతంగా కలిపే ప్రయత్నం చేశారు కానీ ఆ వివాదం ఇంకా అలానే కొనసాగుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ రాజస్తాన్‌లో నాయకుల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు ప్రభావం త్వరలో జరగబోయే 4 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలపై పడకూడదనే ఆయన జైపూర్‌ వెళ్లాల్సి వచ్చింది. కానీ నడ్డా పర్యటన అనంతరం పరిస్థితులు సానుకూల దిశలో పయనిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు.  


గతంలో పార్టీకి సంబంధించి జరిగిన అనేక కీలక సమావేశాలకు వసుంధరా రాజే డుమ్మా కొట్టారు. ఇటీవల జరిగిన శాసనసభా పక్ష సమావేశానికి ఆమె మాత్రమే కాకుండా రాజే వర్గంలోని ఎమ్మెల్యేలు చాలామంది హాజరుకాలేదు. వసుంధర రాజేకు మద్దతు ఇస్తున్న సుమారు 15మందికి పైగా ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వంపై ఫిర్యాదు చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ పంపారు. పార్టీ నాయకత్వం తమకు అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదని, తమ నియోజకవర్గాల్లో సమస్యలను లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వట్లేదని ఆరోపించారు.  

వాస్తవానికి, రెండేళ్ల క్రితం బీజేపీ అధికారం నుంచి వైదొలిగినప్పటినుంచి వసుంధర రాజే, ఆమె అనుచర బృందం రాష్ట్ర నాయకత్వ నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లోనూ వారి అభిప్రాయాన్ని తీసుకోవట్లేదు. కమలదళం పెద్దలతో వసుంధరా రాజేకు మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో ఆమె వర్గానికి ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, డివిజనల్‌ స్థాయి వరకు జరిగిన పార్టీ నియామకాల్లో రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పూనియా.. వసుంధర ప్రత్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చారు. 

రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్‌ పర్నా మినహా రాజే సన్నిహితులు అనేకమందిని పక్కనబెట్టి 14 మందికి మాత్రమే అవకాశం కల్పించడాన్ని సింధియా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రంలో పార్టీకి సమాంతరంగా రాజే మద్దతుదారులు పనిచేస్తున్నారని, దీని కారణంగా ప్రజల్లో పార్టీపై భరోసా కోల్పోతామంటూ షెకావాత్, కటారియా, రాథోడ్, పునియా ఇటీవల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సింధియా వర్గీయులు తమ దూకుడును తగ్గించుకోవట్లేదు. దీంతో రాజస్తాన్‌లో కమలం వికసిస్తుందనే భావనలో ఉన్న పార్టీ అధిష్టానానికి వర్గపోరు తలనొప్పి వ్యవహారంలా మారింది. 

చదవండి:
బెంగాల్‌లో ‘దీదీ’నే: టైమ్స్‌ నౌ– సీ ఓటర్‌ సర్వే

తమిళనాట కొలిక్కివస్తున్న పొత్తులు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు