జంబలకిడిపంబ పార్టీగా టీడీపీ 

27 Sep, 2022 06:10 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి ఆర్కే రోజా, వేదికపై మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజద్‌ బాషా

అందులో ఆడవాళ్లు తొడలు కొడతారు, మగవాళ్లు ఏడుస్తారు 

రాష్ట్రంలో చంద్రబాబు నెగ్గేదిలేదు.. జగనన్న తగ్గేదిలేదు 

రాష్ట్ర పర్యాటక మంత్రి ఆర్‌కే రోజా 

యర్రగొండపాలెం: తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్లు తొడలు కొడతారు, మగాళ్లు ఏడుస్తారని.. అది జంబలకిడిపంబ పార్టీలా తయారైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించటానికే రైతుల పేరుతో టీడీపీ పాదయాత్ర చేయిస్తోందని.. రైతులు ఎక్కడైనా వాకీటాకీలు, ఐఫోన్లు పెట్టుకుని తొడలు కొట్టడం చూశారా అని ప్రశ్నించారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.2కోట్లతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ క్రీడా వికాస కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అధ్యక్షత వహించారు. ఉప ముఖ్యమంత్రి షేక్‌ అంజాద్‌బాషా, జెడ్పీ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు.

మంత్రి రోజా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నిజాయితీగా నెరవేరుస్తుంటే దుష్టచతుష్టయం జగనన్నపై విషం చిమ్ముతోందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నీచరాజకీయాలు మాని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆమె హితవు పలికారు. పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు చంద్రబాబుకు, లోకేశ్‌కు వత్తాసు పలుకుతూ, ప్రజలకు మేలుచేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని ఇంటికి పంపించాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పగటి కలలు కంటున్నాయని విమర్శించారు.

వారి కలలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే చంద్రబాబుకు అక్కాచెల్లెళ్లు కొట్టే దెబ్బ వారికి అబ్బా అనిపించేలాగా ఉండాలన్నారు. ఈసారి కుప్పంలో కూడా టీడీపీ గెలిచే పరిస్థితిలేదని రోజా అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఎగిరేది వైఎస్సార్‌సీపీ జెండానేనని ఆమె అన్నారు.  

బాబు చేయలేనిది జగన్‌ చేశారు 
ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైఎస్‌ జగన్‌ సుపరిపాలన చేశారు కాబట్టే తాము కాలర్‌ ఎగరేసి వెళ్తున్నామని రోజా ధీమాగా చెప్పారు. ‘రాబోయే ఎన్నికల్లో నీవు నెగ్గేదిలేదు, జగనన్న తగ్గేదిలేదని’’ ఆమె చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 30 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది మూడేళ్లలో జగన్‌ చేసిచూపించి దేశంలోనే బెస్ట్‌ సీఎంగా నిలిచారన్నారు.

ఇక 29 గ్రామాల కోసం 26 జిల్లాలకు అన్యాయం చేయటానికి జగనన్న ఒప్పుకోరని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని రోజా స్పష్టంచేశారు. సభలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌తోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు