సాధికారతకు నిలువుటద్దం

19 Mar, 2021 09:10 IST|Sakshi

పీడిత వర్గానికి పాలనా పగ్గాలు

అక్కచెల్లెమ్మలకు లెక్కకు మించిన పదవులు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: సమాజంలోని మెజారిటీ ప్రజలకే పాలనాధికారం కల్పించే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులేస్తున్నారని, ఇందులో భాగంగానే పురపాలక పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకే ప్రాధాన్యత కల్పించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది అరుదైన ఘట్టం అని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడం సీఎం లక్ష్యమని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందరికీ చేరవేసే నాయకత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచే రావాలని ముఖ్యమంత్రి ఆశించారన్నారు. ఈ ఆలోచనల ఫలితంగానే పురపాలక పదవుల్లో ఆ వర్గాలకు పెద్దపీట వేశారని వివరించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..

చట్టం చెప్పిన దానికంటే ఎక్కువగా..
ప్రస్తుతం 11 మేయర్, 75 మునిసిపల్‌ చైర్మన్ల పదవుల్లో (మొత్తం 86)ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 మందికి పదవులివ్వాలని చట్టం చెబుతోంది. కానీ వైఎస్‌ జగన్‌ 67 మందికి ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్ర జనాభాలో 70 శాతం వరకు ఉన్న ఈ వర్గాలకు అత్యధిక శాతం పాలనాధికారం అప్పగించడాన్ని కార్యకర్తలు గర్వంగా భావిస్తున్నారు. 
పురపాలక పదవుల ప్రాతినిథ్యంలోనూ సీఎం జగన్‌ మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారు. 86 పదవుల్లో చట్ట ప్రకారం 43 (50 శాతం) మహిళలకు ఇవ్వాలి. కానీ వైఎస్‌ జగన్‌ 52 మంది (60.4 శాతం) మహిళలకు చైర్‌పర్సన్, మేయర్లుగా అవకాశం కల్పించారు. 
బ్యాక్‌ బోన్‌గా బీసీలు
86 పదవుల్లో బీసీలకు చట్ట ప్రకారం మైనార్టీలతో కలిపి 30 పదవులిస్తే సరిపోతుంది. కానీ 52 పదవులిచ్చారు. 40 మంది (46.51 శాతం) బీసీలకు, 12 మంది (13.95 శాతం) మైనార్టీలకు అధికారం అప్పగించారు. 

తిరుపతిలో భారీ మెజారిటీ ఖాయం
తిరుపతి పార్లమెంట్‌ స్థానాన్ని గతంలో కన్నా భారీ మెజారిటీతో వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుంది. ఈ ఎన్నికను ప్రతిపక్షాలు రెఫరెండం అనుకున్నా పర్వాలేదు. మేము సీరియస్‌గానే తీసుకుంటున్నాం. ఎన్నికలను ఎస్‌ఈసీ సకాలంలో జరిపి ఉంటే శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు జరిగి ఉండేవి. ఇప్పుడు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి అయినా బడ్జెట్‌ సమావేశాలు జరపాల్సి ఉంటుంది. 

చంద్రబాబు ఏదీ ధైర్యంగా ఎదుర్కోలేరు
ప్రతిపక్ష నేత చంద్రబాబు జీవితం అంతా అడ్డదారులు, అక్రమాలే. ఏదీ ధైర్యంగా ఎదుర్కోలేడు. నిన్నటి వరకు మమ్మల్ని పట్టుకొండని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్‌లు మేకపోతు గాంభీర్యం ప్రకటించారు. తాజాగా అసైన్డ్‌ భూ కుంభకోణంలో దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుకుతున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఆనాడు అక్రమంగా కేసులు బనాయించి, జైలుకు పంపి.. అష్టకష్టాలు పెట్టినా, నిర్భయంగా, ధైర్యంగా న్యాయబద్ధంగా ఎదుర్కొన్నారు. బాబు కూడా ఈ నెల 23న విచారణకు హాజరు కావాలి. నిజాలు చెప్పాలి. కానీ రాచ మార్గంలో వెళ్లటం అనేది బాబు డీఎన్‌ఏలోనే లేదు. బాబు లాగా వ్యవస్థలను మేనేజ్‌ చేసుకునే లక్షణాలు సీఎం జగన్‌కు లేవు. చంద్రబాబులా మేము చేసి ఉంటే తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌ పదవి ఈజీగా వశం అయ్యేది. కానీ సీఎం జగన్‌ ప్రజల తీర్పు ప్రకారం జరిగితేనే బాగుంటుందని చెప్పారు. 
చదవండి:
సామాజిక సమతుల్యతకే ప్రాధాన్యత

మరిన్ని వార్తలు