గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం కేసీఆర్‌: సత్యవతి 

17 Sep, 2022 01:31 IST|Sakshi

నేడు సీఎం చేతుల మీదుగా జంట భవనాల ప్రారంభోత్సవం  

సాక్షి, హైదరాబాద్‌: గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం (17న) సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్న గిరిజన, ఆదివాసీ భవనాలను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి ఆమె సందర్శించారు.

ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతంలో గిరిజనులు, ఆదివాసీ భవనాల కోసం స్థలం కేటాయించడం గొప్ప విషయమన్నారు. ఈ రెండు భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.44 కోట్లు ఖర్చు చేసిందని, గిరిజనులు, ఆదివాసీల కోసం అత్యంత ప్రాధాన్యం ఇచ్చినందుకు సీఎంకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఈ రెండు భవనాల ప్రారంభోత్సవం తర్వాత ఎన్టీఆర్‌ స్టేడియం వరకు గిరిజనులు, ఆదివాసీలతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అక్కడ సభ నిర్వహిస్తున్నామని, సీఎం ముఖ్య అథితిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు