లక్ష్మీపుత్రుడి లక్కెలా ఉందో?

18 Oct, 2023 01:21 IST|Sakshi

అసెంబ్లీలో స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించినవారు ఓటమి పాలవుతారన్న సెంటిమెంట్‌ బలంగా  ఉంది. దీనిని బలపరుస్తూ గతంలో పనిచేసిన స్పీకర్లు ఓడిన ఉదంతాలున్నాయి. 1999 నుంచి స్పీకర్లుగా పనిచేసిన వారిలో ఇప్పటివరకు ఎవరూ గెలుపును సొంతం చేసుకోలేకపోయారు.

అయితే ఈసారి  ఆ సెంటిమెంట్‌ను తిరగరాస్తానన్న ధీమాలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. వయసు పైబడుతుండటంతో ఈసారి పోటీ నుంచి తప్పుకొని కుమారుడిని వారసునిగా నిలబెట్టాలని అనుకున్నా సీఎం మాత్రం తాను ఉన్నన్ని రోజులు శీనన్న ఉంటారని పేర్కొనడంతో ఎన్నికల బరిలో ఆయన నిలిచారు.  

సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ లక్ష్మీపుత్రుడు అని సంబోధిస్తుంటారు. అసెంబ్లీలోనే కాదు బహిరంగ సభల్లోనూ ఆయనను అలాగే గౌరవిస్తారు. పోచారం వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రైతుబంధు పథకం ప్రారంభించారు. రూ. వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, అందుకే శీనన్న లక్ష్మీపుత్రుడు అంటూ సీఎం కేసీఆర్‌ పలు సందర్భాలలో పేర్కొన్నారు.  

నిత్యం ప్రజల్లో ఉంటూ...: కామారెడ్డి జిల్లా బాన్సువాడ  సెగ్మెంట్‌ నుంచి 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం... 2004 మినహా 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో విజయాలు సొంతం చేసుకున్నారు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన నిత్యం జనం మధ్యే తిరుగుతుంటారు. వేకువజామునే లేచి బ్యాటరీ వాహనంలో ఊరంతా కలియ తిరుగుతారు. మున్సిపల్‌ సిబ్బంది మురికికాలువలు శుభ్రం చేస్తుంటే నిలబడి వారికి సూచనలు ఇస్తారు.

ఇంటికి చేరగానే ఊళ్ల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ నేతలతో మాట్లాడతారు.  రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.10 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని లెక్కలతో సహా చెబుతారు.  ఏ నియోజకవర్గంలో లేనివిధంగా బాన్సువాడలో 11 వేల డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించి లబ్ది దారులకు అందించారు. విద్య, వైద్య రంగంలోనూ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపారు. బాన్సువాడలోని మాతాశిశు ఆస్పత్రి సేవల్లో దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుంది. 

సెంటిమెంట్‌ ఏం చేస్తుందో? 
స్పీకర్‌ పదవిలో ఉన్న వారు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతూ రావడం ఆనవాయితీగా మారింది. కానీ ఈ సెంటిమెంట్‌ను పోచారం అధిగమిస్తారని ఆయన అనుచరులు నమ్ముతున్నారు. నిత్యం జనం మధ్యే ఉంటూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న పోచారం చరిత్రను తిరగరాస్తారంటున్నారు. నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలంగా లేకపోవడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా లేక సెంటిమెంటే పునరావృతం అవుతుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. 

మరిన్ని వార్తలు