అనారోగ్యానికి గురైన షిండే.. ఆ బాధ్యతలు ఫడ‍్నవీస్‌కు!

4 Aug, 2022 19:31 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీతో చేరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయినప్పటికీ.. వెనకుండి నడిపించేది మాత్రం బీజేపీనే అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఏక్‌నాథ్‌ షిండే అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో మంత్రివర్గ విస్తరణ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ‍్నవీస్‌ తీసుకున్నారు. ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కేబినెట్‌ విస్తరణపై తొందరపడుతోంది మహా ప్రభుత్వం. ఇందులో భాగంగానే షిండేకు బదులుగా ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ అధిష్ఠానంతో చర్చించి తుది జాబితాను ఖరారు చేయనున్నారని పేర్కొన్నాయి. 

సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌ జూన్‌ 30న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కేబినెట్‌ విస్తరణ పెండింగ్‌లోనే ఉంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ఓకే చెబితే శుక్రవారమే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. అనారోగ్యానికి గురైన షిండే ఈ టూర్‌ నుంచి తప్పుకున్నారు. ముఖ్యమంత్రి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు షిండే వర్గాలు తెలిపాయి. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నాయి. ముసాయిదా జాబితాతో గత జూలైలో షిండే, ఫడ‍్నవీస్‌ ఢిల్లీలో పర్యటించారు. కానీ, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 43 స్థానాలకు ఎక్కువ మంది పోటీ పడుతున్న నేపథ్యంలో సంక్లిష్టంగా మారింది. 

ఇదీ చదవండి: Varsha Raut: సంజయ్‌ రౌత్‌ భార్య వర్ష రౌత్‌కు ఈడీ సమన్లు

మరిన్ని వార్తలు