Israel-Hamas war: కాల్పులకు విరామం

23 Nov, 2023 05:32 IST|Sakshi

ఇజ్రాయెల్‌–హమాస్‌ ఒప్పందం

నేటి నుంచి 4 రోజుల పాటు అమలు

ఇజ్రాయెల్‌ మంత్రివర్గం ఆమోదముద్ర

ఖతార్, ఈజిప్ట్, యూఎస్‌ మధ్యవర్తిత్వం

హమాస్‌ చెర నుంచి 50 మందికి విముక్తి

బదులుగా 150 మంది పాలస్తీనా ఖైదీల విడుదల!

ప్రతి 10 మంది విడుదలకు ఒక్కో రోజు అదనపు విరామం

జెరూసలేం/ఐరాస: తాత్కాలికంగానైనా ప్రార్థనలు ఫలించాయి. ప్రపంచ దేశాల విన్నపాలు ఫలితమిచ్చాయి. తీవ్ర ప్రతీకారేచ్ఛతో గాజాపై ఆరు వారాలుగా వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ ఓ మెట్టు దిగొచి్చంది. అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది.

‘‘ఇజ్రాయెల్‌ నాలుగు రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తుంది. బదులుగా హమాస్‌ తన చెరలో ఉన్న 240 మంది పై చిలుకు బందీల్లో 50 మందిని విడిచిపెడుతుంది’’ అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది. బందీలందరినీ విడిపించేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించినట్టు సమాచారం.

హమాస్‌ చెర నుంచి బయట పడేవారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉంటారని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ కూడా పాలస్తీనా మహిళలు, పిల్లలను విడిచి పెట్టనుందని ఖతర్‌ వెల్లడించింది. ఈజిప్టు, అమెరికాతో పాటు ఖతర్‌ కూడా ఇరు వర్గాల చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించడం తెలిసిందే. నిత్యావసరాలతో సహా సర్వం నిండుకుని మానవీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న గాజాకు ఈ నాలుగు రోజుల్లో అదనపు సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించినట్టు ఖతర్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఒప్పందం మలి దశలో భాగంగా మున్ముందు ఇరువైపుల నుంచి మరింత మంది బందీలు విడుదలవుతారని చెప్పుకొచి్చంది. కాల్పుల విరమణ గురువారం ఉదయం పదింటి నుంచి అమల్లోకి రానుంది. యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కుండబద్దలు కొట్టారు! నాలుగు రోజుల విరామం ముగియగానే గాజాపై దాడులు పునఃప్రారంభం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ‘‘మేం ముట్టడిలో ఉన్నాం.

హమాస్‌ను నిర్మూలించి మా లక్ష్యాలన్నింటినీ సాధించేదాకా యుద్ధాన్ని కొనసాగించి తీరతాం’’ అని ప్రకటించారు. దీర్ఘకాలిక యుద్ధానికి సైన్యం మరింతగా సన్నద్ధమయ్యేందుకు విరామం ఉపయోగపడుతుంది తప్ప సైనికుల స్థైర్యాన్ని తగ్గించబోదని ఆయన అన్నారు. అయితే హమాస్‌ చెరలోని బందీల్లో ప్రతి 10 మంది విడుదలకు ప్రతిగా కాల్పుల విరామాన్ని ఒక రోజు చొప్పున పెంచేందుకు ఇజ్రాయెల్‌ సమ్మతించింది.

కాల్పుల విరమణను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలు దేశాధినేతలు స్వాగతించారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న హమాస్‌ ఇస్లామిక్‌ మిలిటెంట్లు మెరుపు దాడికి దిగడం తెలిసిందే. 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలను హతమార్చడంతో పాటు 240 మందికి పైగా బందీలుగా గాజాకు తరలించారు. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు దిగి గాజాపై ఆరు వారాలుగా క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తోంది.

ఏం జరగనుంది...
► ఇజ్రాయెల్, హమాస్‌ రెండూ నాలుగు రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తాయి.
►ముందు తమ వద్ద ఉన్న బందీల్లోంచి 50 మంది మహిళలు, చిన్నారులను రోజుకు 12 మంది చొప్పున హమాస్‌ విడుదల చేస్తుంది.
►అనంతరం ఇజ్రాయెల్‌ కూడా తన జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేస్తుందని ఖతర్‌ ప్రకటించింది.
►బహుశా గురువారమే బందీల విడుదల ప్రక్రియ మొదలవ్వొచ్చని వైట్‌హౌస్‌ అభిప్రాయపడింది.
►ఈ నాలుగు రోజుల్లో గాజాకు అదనపు మానవీయ సాయాన్ని ఇజ్రాయెల్‌ అనుమతిస్తుంది.

ఇప్పట్లో మళ్లీ కాల్పులుండనట్టే...!
విరామానికి స్వస్తి చెప్పి ఇజ్రాయెల్‌ ఇప్పట్లో గాజాపై మళ్లీ దాడులకు దిగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘50 మంది బందీలు విడుదలైతే మిగతా వారినీ విడిపించాలంటూ కుటుంబీకుల నుంచి ఇజ్రాయెల్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. అందులోనూ హమాస్‌ తన చెరలో ఉన్న సైనికులను చిట్టచివరన గానీ వదిలిపెట్టదు.

అప్పటిదాకా దాడులు మొదలు పెట్టేందుకు వారి కుటుంబాలు ఒప్పుకోకపోవచ్చు’’ అని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో హమాస్‌ దీన్ని తమ విజయంగా చెప్పుకుంటే అది నెతన్యాహూ సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. మరోవైపు, గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు బుధవారం కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాయి. ఉత్తర గాజాలో జబాలియా శరణార్థి శిబిరం బాంబు దాడులతో దద్దరిల్లింది. హమాస్‌ కూడా రోజంతా ఇజ్రాయెల్‌పైకి రాకెట్‌ దాడులు కొనసాగించింది.

మరిన్ని వార్తలు