‘పీకే’పై మల్లగుల్లాలు

26 Apr, 2022 05:38 IST|Sakshi

సీనియర్లతో సోనియా చర్చలు

టీఆర్‌ఎస్‌తో ఒప్పందంపై చర్చ

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చేరిక అంశం పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ కోర్టుకు చేరింది. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనతో చర్చించి సోనియా నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. పీకే ప్రతిపాదనలపై కాంగ్రెస్‌ కమిటీ సమర్పించిన నివేదికపై కమిటీ సభ్యులు, సీనియర్లతో సోనియా సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. భేటీలో ప్రియాంక గాంధీతో పాటు సుర్జేవాలా, అంబికా సోని, కేసీ వేణుగోపాల్, ముకుల్‌ వాస్నిక్, దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్, పి.చిదంబరం తదితరులు పాల్గొన్నారు.

పీకే కాంగ్రెస్‌లో చేరతారా అన్నదానిపై ఓ వైపు చర్చ నడుస్తుంటే మరోవైపు ఆయన తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న వైనాన్ని సోనియా సమక్షంలో నేతలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లో రెండు రోజులుగా పీకే మంతనాలు, ఆ పార్టీతో పీకే సంస్థ ఐప్యాక్‌ కుదుర్చుకున్న ఒప్పందం తదితరాలను నేతలు వివరించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా చేసిన దిగ్విజయ్‌సింగ్‌ ఈ అంశాన్ని లేవనెత్తినట్టు చెబుతున్నారు.

పలు ప్రత్యర్ధి పార్టీలతో పీకేకు సంబంధాల దృష్ట్యా పార్టీ నిర్ణయాలను ఆయనతో పంచుకునే విషయంలో గోప్యత పాటించాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. పీకే కాంగ్రెస్‌లో చేరే పక్షంలో పూర్తిగా పార్టీ సేవకే అంకితం కావాలని, ఇతర పార్టీలతో ఎలాంటి సంబంధమూ కొనసాగించొద్దని మరో నేత అన్నట్టు సమాచారం. ‘నీ శత్రువులతో స్నేహంగా ఉండే వ్యక్తులను నమ్మొద్దు’ అంటూ కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ చేసిన ట్వీట్‌ పీకేను ఉద్దేశించేదేనని నేతలన్నారు. ప్రాంతీయ పార్టీలతో పీకేకు సంబంధాలు కాంగ్రెస్‌కు మేలే చేస్తాయని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు