ఆ పాపాలను కడుక్కుంటాం

26 Nov, 2020 05:05 IST|Sakshi

గత ప్రభుత్వాల్లో భాగస్వామ్యమైనందుకు తప్పదు

కేంద్ర మంత్రులు ఇష్టారీతిన మాట్లాడితే సహించం: తలసాని  

సాక్షి, హైదరాబాద్‌: ‘గత ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉండి వారి తప్పుల్లో భాగస్వామ్యం వహించి ఉండవచ్చు.. ఆ పాపాలను కడుక్కుంటాం.. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ వాతావరణాన్ని చెడగొట్టొద్దు..’అని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడా రు. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఉద్రిక్తతలు సృష్టించి బీజేపీ నేతలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేయాలనుకుంటున్నారన్నారు. ‘హైదరాబాద్‌లో రోహింగ్యాలు అక్రమంగా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను తీసుకెళ్లి చూపించండి. హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి నిస్సహాయ మంత్రిలా ఉన్నారా? కరోనా మూలంగా మూసివున్న ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీలోనూ బీజేపీ రాజకీయం చేస్తోంది..’అని విమర్శించారు.  

కేంద్రం ఏం చేస్తోంది.. 
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సర్జికల్‌ స్రైక్‌ గురించి మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌లో ఒకవేళ అసాంఘిక శక్తులు చెలరేగుతుంటే కేంద్రం ఏం చేస్తోంది.. నేను, దానం నాగేందర్‌ హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాళ్లం.. బండి సంజయ్‌కు హైదరాబాద్‌ గురించి ఏం తెలుసు. శాంతిని కోరుకునే ప్రజలు బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యల గురించి సీరియస్‌గా ఆలోచించాలి’అని తలసాని విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం పడగొడితే పడిపోయేంత బలహీనంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లేదని, బాధ్యత కలిగిన పార్టీగా నోరు కట్టేసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌ను 30, 40 ఏండ్లు వెనక్కి నెట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అనుమతించబోమని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్, స్మృతి ఇరానీ హైదరాబాద్‌ గురించి ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని తలసాని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో అసాధ్యమైన హామీలను ఇచ్చిందన్నారు. 

ఓట్ల కోసం బీజేపీ శవ రాజకీయం.. 
టీఆర్‌ఎస్‌ పార్టీని దేశ ద్రోహుల పార్టీ అంటూ ఆరోపిస్తున్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ తన తండ్రి డి.శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ నుంచే రాజ్యసభకు ఎన్నికైన విషయాన్ని గుర్తుంచుకోవాలని దానం నాగేందర్‌ హెచ్చరించారు. ఓట్లు, సీట్ల కోసం బీజేపీ నేతలు శవ రాజకీయం చేస్తున్నారని, హైదరాబాద్‌ నగర ప్రజలు బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో 70 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయంటున్న స్మృతి ఇరానీ.. వారిని రోడ్డున పడేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు ఫ్లెక్సీలు చింపడంపై దానం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా