TN Assembly Polls: కొత్త ఈవీఎంలే ఉపయోగిస్తాం

31 Mar, 2021 13:30 IST|Sakshi
మద్రాస్‌ హైకోర్టు(ఫైల్‌ ఫొటో)

సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ఈవీఎంలనే ఉపయోగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. ఈమేరకు మంగళవారం మద్రాసు హైకోర్టుకు వివరణ ఇచ్చింది. 2017 తర్వాత తయారైన ఈవీఎంలనే వినియోగించనున్నట్లు వెల్లడించింది. అలాగే శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల జాబితాను రాజకీయ పార్టీలకు ఇవ్వలేమని తెలిపింది.  

సాక్షి, చెన్నై :  అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించనున్న ఈవీఎంలపై పలువురు అనుమానం వ్యక్తం చేశారు. సుమారు 15ఏళ్ల నాటి ఈవీఎంలనే ప్రస్తుతం వాడబోతున్నారని ఆరోపించారు. దీనిపై డీఎంకే నేత ఆర్‌ఎస్‌ భారతి మద్రాసు హైకోర్టులో పిటీషన్‌ వేశారు. పాత ఈవీఎంలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని సమస్యాత్మక కేంద్రాల జాబితాను ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ పిటీషన్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి సంజీబ్‌ బెనర్జీ నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ తరఫున న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 11వేలసమస్మాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు.

ఈ విషయమై ఈ నెల 26వ తేదీన అన్ని పార్టీలతో చర్చించినట్లు తెలిపారు. అదే విధంగా, శాంతిభద్రతల దృష్ట్యా జాబితాను ప్రకటించలేమని స్పష్టం చేశారు. పారదర్శకంగా పోలింగ్‌ నిర్వహించేందుకు 44వేల కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలను అమర్చనున్నట్లు వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో 2017 తర్వాత తయారై ఈవీఎంలనే వినియోగిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌ నిబంధనలను సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కోర్టుకు విన్నవించారు. ఈసీ వాదనతో కోర్టు ఏకీభవించింది. విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిపించాలని సూచించింది.  

శరవేగంగా ఏర్పాట్లు  
ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషనర్‌ సాహు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఈసీ సాహు మాట్లాడుతూ ఏప్రిల్‌ 5వ తేదీ నాటికి పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రాల నుంచి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లను తెప్పించుకోవాలని సూచించారు.  

ముమ్మరంగా తనిఖీలు.. కేసులు 
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. పొల్లాచ్చిలో డీఎంకే, అన్నాడీఎంకే వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. దీంతో మంగళవారం ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఈరోడ్‌ సత్యమంగళంలో డీఎంకే కార్యకర్తలు ఓ హోటల్‌ను ధ్వంసం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పుదుకోట్టైలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు రూ.2వేల నోట్లతో సిద్ధం చేసిన కవర్లను ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ స్వాధీనం చేసుకుంది. చెన్నై అన్నానగర్‌లో అధికారులు  నిర్వహించిన తనిఖీలో రూ.48 లక్షలు పట్టుబడింది.

మధురై తిరుమంగళంలో ఓటుకు నోటు పంచుతూ అన్నాడీఎంకే కార్యకర్తలు కెమెరాకు చిక్కడంతో ఎన్నికల అధికారులు విచారణ చేపట్టారు. రాయపురంలో 250 గ్యాస్‌ స్టౌలు, తిరునల్వేలిలో రూ.13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, కాంచీపురంలో 3.5 కేజీల నగలు పట్టుబడ్డాయి. ఈ క్రమంలోనే తిరువణ్ణామలైలో  డీఎంకే అభ్యర్థి ఏవీ వేలు ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ. 25 కోట్ల మేర లెక్కల్లో లేని ఆదాయమున్నట్లు తేల్చారు. 

తపాలా ఓటు హల్‌చల్‌! 
సామాజిక మాధ్యమాల్లో తపాలా ఓటు ప్రత్యక్షం కావడంపై ఎన్నికల కమిషన్‌ విచారించి ముగ్గురిపై కేసు నమోదు చేసింది. తెన్‌కాశిలోని కృష్ణవేణి అనే ఉపాధ్యాయిని తన తపాలా ఓటును ఫొటో తీసి భర్త గణేశ్‌ పాండ్యన్‌కు పంపించారు. ఆయన తన సమీప బంధువు సెంథిల్‌ పాండ్యన్‌కు ఫార్వర్డ్‌ చేశారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఎన్నికల కమిషన్‌ విచారణకు ఆదేశించింది. విచారించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. 

చదవండి: కమల్‌ హాసన్‌పై గౌతమి ఫైర్
సీఎం ‘అక్రమ సంతానం’ వ్యాఖ్యలపై రాజా క్షమాపణ

మరిన్ని వార్తలు