చెత్తకుప్ప వద్ద ప్రచారం.. ఆ ‘విలన్‌’ యూటర్న్‌ తీసుకున్నాడా?!

22 Mar, 2021 14:30 IST|Sakshi
చెత్తకుప్ప వద్ద కూర్చుని మన్సూర్‌ అలీఖాన్‌ ప్రచారం(ఫొటో కర్టెసీ: న్యూస్‌ మినిట్‌)

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ యూటర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓట్లను చీల్చాలనే ఉద్దేశంతోనే ఆయన ఎన్నికల బరిలో దిగారంటూ విమర్శలు రావడంతో మనస్తాపం చెంది, పోటీ నుంచి విరమించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఓ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా కోయంబత్తూరులోని తొండముత్తూరు నియోజకవర్గం నుంచి మన్సూర్‌ అలీఖాన్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. 

ఈ నేపథ్యంలో.. మన్సూర్‌ అలీఖాన్‌, చెత్తకుప్ప వద్ద పెన్ను పేపర్‌ పట్టుకుని, పక్కన కుక్కను పెట్టుకుని వినూత్న రీతిలో ప్రచారానికి తెరతీశారు. రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని బాటసారులకు విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యేను అయిన తర్వాత వీటిని అధిగమించేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. అదే విధంగా, తొండముత్తూరులోని గాంధీ పార్కు ఏరియాలో వాలీబాల్‌ ఆడుతూ సరదాగా గడిపారు. జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ కలివిడిగా మెదిలారు.

ఆ తర్వాత పెరూర్‌ పట్టేశ్వరర్‌ ఆలయం వద్ద దుకాణాదారులతో ముచ్చటించారు. ఈ మేరకు శుక్ర, శనివారాల్లో మన్సూర్‌ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో, కొంతమంది ఓటర్లు ఆయనపై విమర్శలు సంధించినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న, ఆడియో క్లిప్‌లో ఉన్న వివరాల ప్రకారం.. మైనార్టీ ఓట్లను చీల్చేందుకు ఓ రాజకీయ పార్టీ దగ్గర తాను డబ్బు తీసుకున్నాననే ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయం తనను తీవ్రంగా బాధించిందని మన్సూర్‌ పేర్కొన్నారు. నిజాయితీగా సేవ చేద్దామనుకున్నా, ప్రజలు తనను శంకిస్తున్నారని, అందుకే పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, క్లిప్‌ వాస్తవమా కాదా అన్న అంశంపై స్పష్టత లేదు. మన్సూర్‌ అలీఖాన్‌ ఈ విషయంపై ఎలా స్పందిస్తారోనన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా కెప్టెన్‌ ప్రభాకరన్‌ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన మన్సూర్‌ అలీఖాన్‌, విలన్‌గా మెప్పించారు. దక్షిణాది భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన, తెలుగులో ముఠామేస్త్రి, సాంబ, నాయుడమ్మ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు.

చదవండి: ఆస్పత్రిలో సీనియర్‌ నటుడు

మరిన్ని వార్తలు