కమల్‌ హాసన్‌ పార్టీతో ఒవైసీ పొత్తు!?

14 Dec, 2020 14:42 IST|Sakshi

చెన్నై: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆలిండియా మజ్లిస్‌-ఎ-ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్‌ నేతలతో హైదరాబాద్‌లో శనివారం భేటీ అయిన ఆ పార్టీ చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఫలవంతమైన చర్చలు జరిగాయంటూ ట్వీట్‌ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడులో కూడా పాగా వేసేందుకు ఎంఎంఐం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ముస్లిం పార్టీలతో పాటు సినీ నటుడు కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీతో జతకట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న  వెల్లూర్‌, రాణీపేట్‌, తిరపత్తూర్‌, క్రిష్టగిరి, రామనాథపురం, పుదుకొట్టై, ట్రిచి, ముధురై, తిరునల్వేలి జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఒవైసీ, తమిళనాడు ఆఫీస్‌ బేరర్లతో సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపున​కై అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం తిరుచిరాపల్లి, చైన్నైలో జనవరిలో మరోసారి భేటీ అయి భవిష్యత్‌ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్‌ హాసన్‌ సోమవారం ప్రకటించారు. అయితే తాము ఏయే నియోజకర్గాల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టతనిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒవైసీ, కమల్‌తో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడటం గమనార్హం.(చదవండి: బెంగాల్‌లో ఎగరనున్న గాలిపటం!)

కాగా 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ముస్లిం జనాభా సుమారు 5. 86 ఉంటుంది. ఇక ఇప్పటికే అక్కడ యూనియన్‌ ముస్లింలీగ్‌, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌, మనితనేయ మక్కల్‌ కట్చి, మనితనేయ జననయాగ కట్చి, ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్‌, తమిళనాడు తోహీద్‌ జమాత్‌ సహా ఇతర రాజకీయ పార్టీలు మైనార్టీల తరఫున గళం వినిపిస్తున్నాయి. వీటిని కలుపుకోవడంతో పాటు మక్కల్‌ నీది మయ్యంతో కూడా పొత్తు పెట్టుకున్నట్లయితే విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశంపై ఒవైసీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎంఐఎం తమిళనాడు అధ్యక్షుడు వకీల్‌ అహ్మద్‌ గత నెలలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం) జనరల్‌ సెక్రటరీ దురైమురుగన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. (చదవండి: మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన కమల్‌)

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో జట్టుకట్టే అంశం గురించి ప్రస్తావించామని, అయితే ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఏఐడీఎంకే పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు బదులుగా బీజేపీకి మద్దతు పలికే పార్టీతో తాము కలిసి నడిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో ఎన్డీయే ప్రభుత్వం, బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే కమల్‌హాసన్‌తో ఒవైసీ జట్టుకట్టనున్నారనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సైతం జనవరిలో రాజకీయ పార్టీ స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు