Tamil Nadu politics: రాజకీయాల్లోకి ‘దళపతి’ విజయ్‌

4 Feb, 2024 00:23 IST|Sakshi

తమిళగ వెట్రి కళగం పేరిట పార్టీ ప్రకటన

సాక్షి, చెన్నై: తమిళ రాజకీయ ముఖచిత్రంపై మరో అగ్రతార మెరిసింది. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు తమిళ అభిమానుల ‘దళపతి’, ప్రముఖ నటుడు విజయ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదలచేశారు. ‘‘తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నాం. పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేశాం.

2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయడమే మా లక్ష్యం. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వబోం. అవినీతి, అధ్వాన్న పరిపాలన, విభజన రాజకీయాలతో పాలిటిక్స్‌ను భ్రషు్టపట్టించారు.

నిస్వార్థంగా, పారదర్శకంగా, మార్గదర్శకంగా, అద్భుతమైన పరిపాలనకు బాటలు పరిచే రాజకీయ ఉద్యమం కోసం తమిళ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కుల, మత విభేదాలకు అతీతంగా పాలించే అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ’’ అని విజయ్‌ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు విజయ్, సీనియర్‌ నేతలు గత నెల 25వ తేదీన పార్టీ సర్వసభ్య మండలి, కార్యనిర్వాహణ మండలి సమావేశంలో పాల్గొని పార్టీ నియమావళి, నిబంధనలకు ఆమోద ముద్ర వేశారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఎన్నాళ్లనుంచో సేవ చేద్దామనుకుంటున్నా
‘‘రాజకీయాల్లో మార్పులు తేగల సత్తా  ప్రజా ఉద్యమానికే ఉంది. అది మాత్రమే తమిళనాడు పౌరుల హక్కులను కాపాడగలదు. కన్న తల్లిదండ్రులతోపాటు నాకు పేరు ప్రతిష్టలు తెచి్చన రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి, విజయం సాధించి ప్రజలు కలలుగన్న రాజకీయ మార్పుకు బాటలు వేయడమే మా లక్ష్యం. ఈసీ నుంచి అనుమతులు వచ్చాక పార్టీ కార్యక్రమాలు మొదలుపెడతాం.

లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ కార్యకర్తలను సంఘటితం చేసి పార్టీ విధానాలు, పార్టీ జెండా, పార్టీ గుర్తు, ఇతర కార్యాచరణకు తుదిరూపునిస్తాం’’ అని విజయ్‌ స్పష్టంచేశారు. ‘‘ రాజకీయాలంటే సినిమా ప్రపంచం నుంచి నాకు ఒక విరామం కాదు. తపనతో రాజకీయాల్లోకి వస్తున్నా. రాజనీతి అంటే ప్రజలకు గొప్పగా సేవ చేయడం. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసి రాజకీయాలకు అంకితమవుతా’’ అని అన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega