చల్లారని సర్దుబాటు మంటలు

4 Mar, 2024 05:20 IST|Sakshi
రాజమహేంద్రవరం రూరల్‌ సీటు దుర్గేష్‌కు కేటాయించాలంటూ జనసేన నేతల ర్యాలీ,

రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలు నియోజకవర్గాల్లో తీవ్రస్థాయికి వర్గ విభేదాలు

బల ప్రదర్శనకు దిగుతున్న జనసేన, టీడీపీ శ్రేణులు

నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే శేషారావుకు మద్దతుగా భారీగా వస్తున్న నేతలు

రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల, దుర్గేష్‌ వర్గాల ఆందోళనలు

సీట్లపై తేల్చని బాబు, పవన్‌.. 

మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ అల్టిమేటం  

సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు మంటలు చల్లారడం లేదు. ఇరు పార్టీల అధినేతలు తీసుకున్న నిర్ణయాలు, వ్యవహార శైలి ఆయా పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. వెరసి వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. సీట్లపై ఎటూ తేల్చకపోవడంతో ఇరు పార్టీల నేతలు వర్గాలుగా విడిపోయి బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ అధినాయ­కత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

తమ నేతకు సీటు కేటాయించని పక్షంలో మూకుమ్మడి రాజీనామాలకు దిగుతామని అల్టిమేటం ఇస్తు­న్నారు. నియోజకవర్గంలో ఎలా గెలుస్తారో చూస్తా­మంటూ శపథం చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం నిరాకరిస్తే తమ సత్తా ఏమిటో పార్టీల అధిష్టానా­లకు చూపేందుకు సంసిద్ధమవుతున్నారు. ప్రజల్లో తమకున్న ఆదరణను చూపేందుకు కార్యకర్తలను భారీ స్థాయిలో సమీకరించుకుని మరీ బలప్రద­ర్శనలకు దిగుతున్నారు. కొవ్వొత్తుల ర్యాలీలు, మౌనపోరాటం వంటి కార్యక్రమాలతో వినూత్న నిరసనలకు నాంది పలకడం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.


నిడదవోలును బూరుగుపల్లికి కేటాయించాలని నినదిస్తున్న టీడీపీ నేతలు  

ఎడతెగని ఉత్కంఠ
రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలు ఉమ్మడి స్థానాలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. సీటు తనదంటే తనదంటూ జనసేన, టీడీపీ నేతలు ప్రకటించుకుంటున్నారు.  ఈ గందరగోళాన్ని చక్క­ది­ద్దా­ల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం ఇరు వర్గాల మధ్య విభేదాలకు మరింతగా ఆజ్యం పోస్తోంది.

నిడదవోలులో నిరసన గళం
నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు పట్టం కట్టక­పోతే సహించేది లేదని టీడీపీ శ్రేణులు హెచ్చ­రిస్తున్నాయి. కచ్చితంగా తమ నేతకు కేటాయించాల్సిందేనన్న అల్టిమేటం జారీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేకి మద్దతుగా ఉండ్రాజవరం మండలంలోని ఆయన స్వగ్రామం వేలివెన్నుకు పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. శనివారం సైతం అధిక సంఖ్యలో కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకుని శేషారావుకు మద్దతుగా నినాదాలు చేస్తూ బలప్రదర్శనకు దిగారు.

ఆయనకు టికెట్‌ దక్కని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామని కుండ బద్దలుగొడుతున్నారు. జనసేన నేత కందుల దుర్గేష్‌ నిడదవోలు నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చెప్పినట్లు ప్రకటించుకోవడం పొత్తు ధర్మమా? అంటూ ప్రశ్నించారు. దుర్గేష్‌ను నిడదవోలుకు పంపితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అదే జరిగితే ఇక్కడికి వచ్చి ఎలా గెలుస్తారో తామూ చూస్తామంటూ సవాల్‌ విసురుతున్నారు.

దుర్గేష్‌ దారెటు..?
రాజమహేంద్రవరం రూరల్‌ జనసేన నేత కందుల దుర్గేష్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే రూరల్‌ సీటు దక్కుతుందన్న ఆయన ఆశలకు రూరల్‌ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గండి కొట్టారు. బుచ్చయ్య ఒత్తిడికి తలొగ్గిన టీడీపీ, జనసేన అధి­ష్టానాలు దుర్గేష్‌ను నిడదవోలుకు సాగనంపే కార్య­క్రమానికి శ్రీకారం చుట్టాయి. దుర్గేష్‌ను మంగళగిరి పిలిపించి మరీ హితబోధ చేశాయి. ఈ పరిణామం ఇటు రాజమహేంద్రవరం రూరల్‌ జనసేన, అటు నిడదవోలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్ర­హావేశాలు నింపాయి. ఇద్దరు నేతల మధ్య వైషమ్యాలకు ఆజ్యం పోశాయి. ఈ పరిస్థితుల్లో దుర్గేష్‌ ఎటు వెళ్లాలో తెలి­యక తికమకపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దుర్గేష్‌కు స్థానచలనంపై జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. రూరల్‌లో బుచ్చయ్యకు సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు.  

దుర్గేష్‌కు మద్దతుగా ఆందోళన
దుర్గేష్‌ను నిడదవోలుకు పంపాలని జనసేన అధినేత పవన్‌ తీసుకున్న నిర్ణయంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ ఇచ్చిన మాటను సైతం కట్టుబడి ఉండలేరా అని ప్రశ్నిస్తున్నారు. దుర్గేష్‌కు రూరల్‌ కేటాయించాలని కోరుతూ కడియం నుంచి రాజమహేంద్రవరం నగరంలోకి కోటిపల్లి బస్టాండ్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన బలోపేతానికి దుర్గేష్‌ చేసిన కృషిని కూడా గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో అధిష్టానం ఉందా అని మండిపడ్డారు. దుర్గేష్‌కు సీటు కేటాయించకపోతే బుచ్చయ్యకు సహకరించేది లేదని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం రూరల్‌ కొంతమూరులో దుర్గేష్‌కు మద్దతుగా క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు.

ప్రకటించే వరకూ చూస్తానంటున్న గోరంట్ల
రాజమహేంద్రవరం రూరల్‌ సీటు తనకేనని సీనియర్‌ టీడీపీ నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇరు పార్టీల అధ్యక్షులూ ప్రకటించేంత వరకూ వేచి చూస్తానని అంటున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు