బిహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? | Sakshi
Sakshi News home page

బిహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?

Published Mon, Mar 4 2024 4:13 AM

Gudivada Amarnath comments over Prashant Kishor - Sakshi

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ 

పీకేను చంద్రబాబు పలుమార్లు రహస్యంగా కలిసారు

ఒక రోజు క్రితం కూడా హైదరాబాద్‌లో సమావేశమయ్యారు

ఒక పీకే వల్ల కావడం లేదనే రెండో పీకేని తెచ్చుకున్నారా..?

మాంత్రికుడనుకుంటున్న ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎందుకు సున్నా అయ్యాడు?

సొంత రాష్ట్రం బిహార్‌లో రాజకీయ భిక్షగాడిలా మారాడు 

ఏపీలో సర్వే టీం లేని ఆయన డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని ఎలా చెప్పారు?

సాక్షి, విశాఖపట్నం: ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీ బిహార్‌లో దిక్కుమొక్కూ లేకుండా చిత్తుగా ఓడిపోనున్న తరహాలోనే చంద్రబాబు–పవన్‌కళ్యాణ్‌ ఓటమికి సిద్ధంగా ఉన్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. బిహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని ప్రశాంత్‌ కిశోర్‌పై విరుచుకుపడ్డారు. డబ్బులు తీసుకుని కన్సల్టెన్సీలో ఒక డైరెక్టర్‌గా ఉండే ప్రశాంత్‌ కిషోర్‌ బిహార్‌లో సొంతంగా పార్టీ పెట్టుకున్నాడని, ఇంట గెలవని వాడి మాటలను ఏపీ ప్రజలు నమ్మరని చెప్పారు. ఆదివారం విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు, ప్రశాంత్‌ కిశోర్‌ పలుమార్లు రహస్యంగా భేటి అవుతున్నారని, అందులో భాగంగానే రెండు రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లో ఇద్దరూ రహస్యంగా కలుసుకున్నట్లు పలు పత్రికల్లో వచ్చిందన్నారు. ‘డీబీటీ, అభివృద్ధి రెండూ చేయలేని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారన్నట్లు  ప్రశాంత్‌కిశోర్‌ చెప్పడానికి కారణం నెలరోజులు క్రితం చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశమే కదా? ఆ తర్వాత రహస్యంగా పలుమార్లు ప్రశాంత్‌ కిశోర్‌ చంద్రబాబును కలవడం నిజం కాదా? ఒక పీకే వల్ల కావడంలేదని చంద్రబాబు రెండో పీకేని కూడా తెచ్చుకున్నారు’ అని పేర్కొన్నారు.

ఒక స్టేట్‌మెంట్‌తో మొత్తం ప్రజల నాడిని మార్చేయొచ్చని, తాను మహా మాంత్రికుడినని అనుకుంటున్న ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చివరకు తన సొంత రాష్ట్రం బిహార్‌లో రాజకీయ భిక్షగాడిగా మారాడని ఎద్దేవా చేశారు. పేదలకు మేలు చేస్తూ అవినీతికి తావులేకుండా అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఓట్లు వేయకుంటే చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసేవారికి ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. 

బాబు, పీకే పన్నాగాలు తిప్పికొడతాం..
చంద్రబాబు, చెల్లని రూపాయి ప్రశాంత్‌ కిషోర్‌ కొత్త ఎత్తుగడలకు పన్నాగాలు పన్నుతున్నారని, వాటిని ఎన్నికల్లో తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైఎస్సార్‌సీపీనే గెలుస్తుందని సామాన్యులు సైతం చెబుతున్నారని గుర్తు చేశారు. సామాన్యులు చెప్పేది నెగ్గుతుందా? లేక చెల్లని రూపాయి ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పేది నెగ్గుతుందా? అనేది మీరే చూస్తారన్నారు.

చంద్రబాబే గెలుస్తాడనుకుంటే మేనిఫెస్టోలో సంక్షేమం గురించి అది చేస్తా.. ఇది చేస్తానంటూ ఎడాపెడా హామీలివ్వాలని ప్రశాంత్‌ కిశోర్‌ ఎందుకు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. ఏపీలో అసలు సర్వే టీం లేని ప్రశాంత్‌ కిశోర్‌ డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని ఎలా చెప్పారని ప్రశ్నించారు. అభివృద్ధి లేకుంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం ఐదేళ్లుగా ఎలా పురోగమిస్తాయని సూటిగా నిలదీశారు.

బిహార్‌లో చెల్లనికాసులా మారడంతో ఇక్కడ కొన్ని కాసులైనా ఏరుకుందామనే ఉద్దేశంతో చంద్రబాబుతో డీల్‌ కుదుర్చుకున్నారని చెప్పారు. ఆ డీల్‌లో భాగంగా చేస్తున్న ప్రకటనలను ఏపీలో ఉన్న 5.30 కోట్ల మంది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ భారీ విజయం సాధించనున్నట్లు లగడపాటి రాజగోపాల్‌తో చంద్రబాబు జోస్యం చెప్పించారని, ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందేనని మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement