టీడీపీ ఎదురుదాడి

17 Mar, 2021 04:01 IST|Sakshi

రాజధాని అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిన్నటి వరకూ సవాళ్లు

ఇప్పుడు కక్ష సాధిస్తున్నారని నేతల హంగామా 

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించి సీఐడీ అధికారులు చంద్రబాబుకు మంగళవారం నోటీసులు ఇవ్వడంతో టీడీపీ నాయకులు ఒక్కసారిగా ఎదురుదాడికి దిగారు. భూసమీకరణలో అక్రమాలు, దళితులకు జరిగిన అన్యాయంపై మాట్లాడకుండా కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టారని నాయకులంతా గగ్గోలు పెట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ హయాంలో రాజధాని భూసమీకరణపై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బెదిరింపులు, దౌర్జన్యాలతో అక్కడ దళితుల భూములను బలవంతంగా లాక్కున్న ఉదంతాలు అనేకం బయటపడ్డాయి. అలా లాక్కున్న భూములను చంద్రబాబు బినామీలు బిట్లుబిట్లుగా చేజిక్కించుకున్నట్లు కూడా తేలింది.

రాజధాని వ్యవహారాలను దగ్గరుండి నడిపించిన అప్పటి మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, తదితర నేతలు చాలామంది పెద్దఎత్తున దళితుల భూములను భూసమీకరణ ముసుగులో దక్కించుకున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసి పెద్దఎత్తున భూములను సొంతం చేసుకున్నారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం ఇప్పటికే విచారణ జరిపించి చర్యలకు ఉపక్రమించడంతో కోర్టులను ఆశ్రయించి వాటిని అడ్డుకున్నారు. ఇప్పుడు సీఐడీ కేసులోనూ విచారణ జరక్కుండా అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఒకపక్క విచారణ జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు కక్ష సాధింపునకు దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విచారణ జరక్కుండా కోర్టులను ఆశ్రయించిన టీడీపీ నేతలే తమపై ఇప్పటివరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని మొన్నటివరకూ సవాళ్లు విసిరారు.

రాజధానిపై ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారని.. దమ్ముంటే నిరూపించాలని చంద్రబాబు అనేకసార్లు ప్రశ్నించారు. ఇప్పుడు వాటిపై విచారణ జరుపుతుంటే తమ సవాళ్లను మరచిపోయి అసలు రాజధానిలో అవినీతే జరగలేదని, కేవలం కక్ష సాధించడం కోసం ఇలా చేస్తున్నారని ఇప్పుడు హడావుడి చేయడం ప్రారంభించారు. సీఐడీ అధికారులు బాబుకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు వరుసగా మీడియా ముందుకు వచ్చి ఇదే పాట అందుకోవడంపై రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చాలని ప్రయత్నించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.   

మరిన్ని వార్తలు