మత రాజకీయాల్లో చంద్రబాబుకు సరిలేరెవ్వరూ...

11 Jan, 2021 15:55 IST|Sakshi

సాక్షి, గుంటూరు/విజయవాడ: క్రైస్తవ సమాజం పట్ల ప్రతిపక్షనేత చంద్రబాబు అవలంభిస్తున్నతీరుపై ఫిలిప్‌ సి తోచర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మత రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు ఎవ్వరూ సరిలేరని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మెడలో శిలువ వేసుకొని బైబిల్‌ చదువుతూ నా జన్మధన్యమైందని ప్రకటించుకున్న ఆయన..  ఇప్పుడు దేవాలయాలపై జరుగుతున్న దాడులకు క్రైస్తవ సమాజాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు. కాగా, క్రైస్తవ మతంపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్‌) ఫిలిప్‌ సి తోచర్‌ శనివారం ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై సోమవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. 

రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు వైఖరి అసహ్యం కలిగిస్తుందని, తన ఉనికిని చాటుకోవడం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారని ఫిలిప్‌ మండిపడ్డారు. వ్యక్తులను, వ్యవస్థలను వాడుకొని వదిలి వేయటంలో చంద్రబాబు దిట్ట అని ఆయన పేర్కొన్నారు. గతంలో చాలా సందర్భాల్లో చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఓట్ల కోసమే చంద్రబాబు క్రైస్తవులను వాడుకుంటాడని, ఇప్పుడు అతని అసలు రంగు బయటపడటంతో రానున్న ఎన్నికల్లో క్రైస్తవ సమాజం అతనికి తగిన గుణపాఠం నేర్పుతుందని హెచ్చరించారు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసినందుకు అతను తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పతకాలకు లభిస్తున్న ఆదరణను చూసి చంద్రబాబుకు మతి భ్రమించిందని ఫిలిప్‌ అన్నారు. తాను అధికారంలోకి రావడం అసంభవమని తెలిసి ఫ్రస్ట్రేషన్ లో ఏదోదో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయటం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. ఫిలిప్‌ సి తోచర్‌ 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఆంగ్లో ఇండియన్‌ కోటాలో నామినేటెడ్‌ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. 


 

మరిన్ని వార్తలు