టీడీపీలో టికెట్ల బేరం!

13 Feb, 2024 04:54 IST|Sakshi

జోనల్‌ కమిటీలా అభ్యర్థుల్ని నిర్ణయించేది?

బీద రవిచంద్ర, కిలారు రాజేష్‌లకు ఇక్కడి పరిస్థితులు తెలుసా?

టికెట్‌ విషయంలో చర్చించేందుకు హైదరాబాద్‌కు పిలవడమేంటి?

పోటీలో ఎక్కువ మంది ఉన్నారంటూ రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు అడుగుతున్నారు

డబ్బులివ్వకుంటే  రాబిన్‌శర్మ రిపోర్టు నెగిటివ్‌ అని పక్కన పెడుతున్నారు 

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కట్టలు తెంచుకుంటున్న టీడీపీ నేతల ఆక్రోశం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు అధిష్టానం తీరుపై కుతకుత ఉడికిపోతున్నారు. అధికార పార్టీ దూకుడు మీద ఉండగా.. టీడీపీ అసలు అభ్యర్థులనే ప్రకటించకుండా జాప్యం చేస్తుం­డడంపై ఆ పార్టీ నేతలు మండిపడు­తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫి­కేషన్‌ వెలువడనుండగా.. ఒకవైపు పొత్తులు, మరోవైపు కమిటీల పేరుతో ఎంతో కాలంగా పనిచేసిన లీడర్లను కూడా హీనంగా చూస్తున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారంటూ ఎక్కువ డబ్బు డిమాండు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని ఒక సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.

మమ్మల్ని నిర్ణయించేది జోనల్‌ కమిటీనా?
తెలుగుదేశం పార్టీలో ఇటీవలే జోనల్‌ కమిటీని వేశారు. రాయలసీమకు సంబంధించిన ఈ జోన­ల్‌ కమిటీలో బీద రవిచంద్రయాదవ్, కిలారి రాజేష్‌ ఉన్నారు. వీళ్లిద్దరి పెత్తనం ఎక్కువైందనేది ఇక్కడి నేతల ఆవేదన. చీటికి మాటికి హైద­రాబాద్‌ పిలుస్తున్నారని, అక్కడికి వెళితే ‘మీ నియోజకవర్గంలో పోటీ ఎక్కువగా ఉంది. మీరు చెబుతున్న డబ్బుకైతే మీకు టికెట్‌ ఇవ్వడం కష్టం’ అని చెబుతున్నారని అంటున్నారు. ఇద్దరు అభ్యర్థులను ఒక్కొక్కరి చొప్పున  (వన్‌ టూ వన్‌) పిలిచి డబ్బులు అడుగుతున్నారని, టికెట్‌ కోసం రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఇవ్వడానికి ఇన్నేళ్లు జెండా మోయడం దేనికని మండి పడుతున్నారు.

రాబిన్‌ శర్మ రిపోర్టులంటూ..
ప్రస్తుతం టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్‌శర్మ వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రతి ఒక్కరినీ పిలిచి, మీకు రిపోర్టులు నెగిటివ్‌గా ఉన్నాయని చెబుతున్నారని, ఈ రిపోర్టులను ఆధారం చేసుకుని జోనల్‌ కమిటీ మెంబర్లు డబ్బులు అడుగుతున్నట్టు నేతలు వాపోతున్నారు. ఎవరికైతే టికెట్‌ ఇవ్వకూడదనే ఆలోచన ఉందో వారికి సంబంధించి రాబిన్‌ శర్మ రిపోర్టు నెగిటివ్‌గా ఉందని చెబుతున్నారని, డబ్బులిచ్చిన వారికి రిపోర్టు బాగుందని అంటున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

టూమెన్‌ కమిటీ ఇంకెన్నాళ్లు?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల, మడకశిర రెండూ రిజర్వుడు నియోజకవర్గాలు. శింగనమలలో ఇద్దరు ఓసీ నేతలతో టూమెన్‌ కమిటీ వేశారు. ఇక్కడ ఈ ఇద్దరిదే పెత్తనం. మడకశిరలోనూ అంతే. మైనింగ్‌ మాఫియాగా ఉన్న గుండుమల తిప్పేస్వామి అక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదమని, ఎస్సీలను డమ్మీ చేశారని టీడీపీ ఎస్సీ నేతలు ఆరోపిస్తున్నారు. కాలపరిమితి లేని కమిటీగా వ్యవహరిస్తున్నారని, తమను వీరినుంచి విముక్తి చేయాలని వారు కోరుతున్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు