తెలంగాణలో భారీ మార్పులొస్తాయి: సునీల్‌బన్సల్‌

12 Sep, 2022 01:55 IST|Sakshi
మునుగోడు మండలం కొంపల్లిలో  మీడియాతో మాట్లాడుతున్న సునీల్‌ బన్సల్‌   

మునుగోడు: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో భారీ మార్పులు జరగనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ బన్సల్‌ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కుటుంబ పాలనను అంతమొందించి బీజేపీ పాలన తీసుకొస్తామన్నారు.

త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ అనుచిత నిర్ణయాల వల్ల అప్పులపాలైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ఉపఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరిస్తామన్నారు.

హుజూరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలు ధర్మయుద్ధం వైపు ఎలా నడిచారో మునుగోడులో కూడా అదే తరహాలో నడుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ జాతీయ నాయకుడు వివేక్‌ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు