మేడిగడ్డ పంచాయతీ.. బారికేడ్లతో బ్యారేజ్‌ మూసివేత

4 Nov, 2023 09:02 IST|Sakshi

సాక్షి, జయశంకర్‌ భూపాలపల్లి:  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ల​క్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్యారేజ్‌ పిల్లర్ల కుంగుబాటుపై జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా ఉండడం.. అది కాస్త రాజకీయ విమర్శలకు దారి తీయడం తెలిసిందే.  మరోవైపు మేడిగడ్డ సందర్శన కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతుండడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బ్యారేజ్‌ను పరిశీలించగా.. తాజాగా బీజేపీ నేతలు బ్యారేజ్‌ సందర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, ఈటల రాజేందర్ శనివారం బ్యారేజ్‌ వద్దకు వెళ్లనున్నారు. హెలికాఫ్టర్‌లో బ్యారేజ్‌ను పరిశీలించే అవకాశం ఉంది. మేడిగడ్డతో పాటు అన్నారం (సరస్వతీ) బ్యారేజ్‌ను కూడా సందర్శించనున్నట్లు సమాచారం.

బారికేడ్లు ఏర్పాటు
మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు పోలీసులు. రాహుల్‌ పర్యటన సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు బ్యారేజ్‌ వైపు దూసుకెళ్లే యత్నం చేయగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యారేజ్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇనుప రేకులు, బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ బ్యారేజ్‌ వైపు ఎవరినీ వెళ్లకుండా చూస్తున్నారు. ప్రస్తుతానికి అధికారులు, సిబ్బందిని మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు.

నివేదిక ఇలా.. 
బ్యారేజీ ఏడో బ్లాక్‌  20వ పియర్‌ కుంగిపోయి దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన విషయం తెలిసిందే.  అయితే కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ అక్టోబర్‌ 24వ తేదీన బ్యారేజ్‌ను సందర్శించింది. ప్రాజెక్టకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం నుంచి కోరింది. కానీ, తెలంగాణ సర్కార్‌ పూర్తి వివరాలు అందించలేదని సదరు కమిటీ తాజాగా తన నివేదిక విడుదల చేసింది. అంతేకాదు.. ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పియర్లు కుంగాయని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. 7వ నంబర్‌ బ్లాక్‌లో తలెత్తిన తీవ్ర ప్రతికూల పరిస్థితితో బ్యారేజీ పనితీరుపై తీవ్ర దుప్రభావం పడిందని, ప్రస్తుత పరిస్థితిలో అది ఉపయోగానికి పనికిరాదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్త: డిజైన్‌కు విరుద్ధంగా మేడిగడ్డ నిర్మాణం! 

రాజకీయ విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీలకు.. మేడిగడ్డ ఎన్డీఎస్‌ఏ నివేదిక విమర్శల్ని మరింతగా గుప్పించేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ నివేదికపై అధికార బీఆర్‌ఎస్‌ మండిపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కుటప్రూరితంగా నివేదిక ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కమిటీ రావడం, అధ్యయనం చేయడం, నివేదిక ఇవ్వడం అంతా మూడు రోజుల్లోనే జరిగిపోయిందని, ఈ వేగం చూస్తే దేశంలో మిగతా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో.. ఇదీ అలాగే చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు