కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?.. కమిటీల ఏర్పాటుతో ముసలం.. దేనికి సంకేతం

18 Dec, 2022 16:51 IST|Sakshi

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీల ఏర్పాటుతో ముసలం బయల్దేరింది. కొత్త కూర్పు సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. నాయకుల మధ్య సమన్వయం లోపించడం హై కమాండ్‌ను ఇబ్బంది పెడుతోంది. కమిటీల ఏర్పాటుతో ఓరుగల్లు కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. ఈ అసంతృప్తి నుంచే సీనియర్ నేత కొండా సురేఖ తనకిచ్చిన పదవికి రాజీనామా సమర్పించారు. ఇంతకీ ఓరుగల్లు కేంద్రంగా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? 

కొండా రాజీనామా ఎందుకిచ్చారు?
కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహాల కాపురం. పార్టీలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరంతరం అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉంటాయి. కొత్తగా ప్రకటించిన పీసీసీ.. డీసీసీ కమిటీలు కొందరికి ఉత్సాహం కలిగిస్తే.. మరికొందరికి కోపాన్ని తెప్పిస్తున్నాయి. సీనియర్లు అనేక మంది తమకు సరైన పదవి రాలేదనో.. తమవారికి పదవులు దక్కలేదనో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం అసమ్మతి సెగలు రగులుతున్నాయి. తనకిచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ ఆ పదవికి రాజీనామా సమర్పించారు.

పొలిటికల్ అఫైర్స్ కమిటీలోకి తమకంటే జూనియర్‌లను తీసుకొని సీనియర్లమైన  తమకు అవకాశం కల్పించకపోవడంతోపాటు వరంగల్‌కు చెందిన ఏ ఒక్క లీడర్ పేరు ఆ కమిటీలో లేకపోవడం అవమానంగా భావిస్తున్నామని ప్రకటించారు కొండా సురేఖ. వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి తాము సూచించిన వ్యక్తికి ఇవ్వకపోవడంతో పాటు.. తాము కోరుకున్న రెండు నియోజకవర్గాలపై అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంపైనా కొండా దంపతులను ఆందోళనకు గురి చేస్తోందట. అందుకే కొండా సురేఖ టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి  రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారనే ప్రచారం సాగుతుంది. 

మూడు ముక్కలు, ఆరు చెక్కలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు డిసిసిలు ఉండగా మూడింటికే జిల్లా కమిటీలను ప్రకటించారు. హనుమకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో పాతవారినే కొనసాగించాలని హైకమాండ్‌ నిర్ణయించింది. మరో మూడు జిల్లాలైన వరంగల్, భూపాలపల్లి, జనగామల్లో మాత్రం ఏకాభిప్రాయం రాక గందరగోళం ఏర్పడటంతో డీసీసీల ప్రకటన వాయిదా పడింది. జ‌న‌గామ జిల్లాకు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘ‌వ‌రెడ్డితోపాటు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కూడా పదవి ఆశిస్తున్నారు.

ఆ ఇద్దరికి తోడు పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సైతం తాను సూచించిన వ్యక్తికే డిసిసి ఇవ్వాలని పట్టుపడుతున్నారు. వ‌రంగ‌ల్ విష‌యంలో సీనియర్ నేత‌ కొండా ముర‌ళీ, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డిల మద్య డిసిసి దోబూచులాడుతోందట. ఇక జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా అధ్యక్ష ప‌ద‌వికి ఎమ్మెల్యే శ్రీధ‌ర్‌బాబు వ‌ర్గం నేత‌గా ఉన్న అయిత ప్రకాష్‌ రెడ్డిని కొన‌సాగించాల‌నే డిమాండ్ వినిపిస్తుండ‌గా, రేవంత్ రెడ్డి అనుచరుడుగా ముద్రపడ్డ గండ్ర స‌త్యనారాయ‌ణ‌కు లేదా ఆయ‌న సూచించిన వ్యక్తికి డీసీసీ ప‌గ్గాలు అప్పగించాల‌నే డిమాండ్ కొనసాగుతోంది. 

చేయి కాలుతుందా? బలం పెరుగుతుందా?
ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా..నేత‌ల‌ మద్య  స‌మ‌న్వయం లేకపోవడం.. ఆధిపత్య పోరు కారణంగా మూడు జిల్లాల అధ్యక్ష పదవులు ఖరారు కాలేదని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామ‌కాల్లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మార్క్ స్పష్టంగా క‌నిపిస్తోంది. వాస్తవానికి పాతవారికే అవ‌కాశం ఉంటుంద‌ని ప్రచారం జ‌రిగినా.. సీనియారిటీ, పార్టీలో ప‌నిచేసిన అనుభ‌వం, రాజ‌కీయ స‌మ‌ర్థత వంటి అంశాల‌ను బేరీజు వేసుకుని మూడు జిల్లాల విష‌యంలో పాత‌వారి పైపే మొగ్గు చూపిన‌ట్లుగా తెలుస్తోంది.

మిగతా మూడు జిల్లాల విషయంలో ఆ దిశగా చర్యలు చేపట్టి స‌మ‌ర్థత, కార్యనిర్వహ‌ణ సామ‌ర్థ్యం గ‌ల నేత‌ల‌కే అవ‌కాశం ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారం రోజుల్లో నేతల మధ్య ఏకాభిప్రాయం తీసుకువచ్చి మిగిలిన మూడు జిల్లాల అధ్యక్ష పదవులను ఖరారు చేస్తారని..అసంతృప్తితో ఉన్న నేతలను సైతం సముదాయించి సముచిత స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు