పూలే, అంబేడ్కర్‌ల ప్రతిరూపం ఈటల

29 Oct, 2021 04:39 IST|Sakshi
ఈటలకు మద్దతుగా అభివాదం చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు  

ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌లా టీఆర్‌ఎస్‌ వ్యవహరించగలదా?

హుజూరాబాద్‌లో ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్యే పోటీ: జాజుల   

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ రెండు పార్టీలకు, ఇద్దరు వ్యక్తులకు మధ్య జరిగే ఎన్నిక కాదని, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పూలే, అంబేడ్కర్‌లకు ప్రతిరూపం ఈటల రాజేందర్‌ అని, ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం సబ్బండ వర్గాలకు ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్‌లో డబ్బులు వెదజల్లుతూ, మద్యం పారించి అధికారం సొంతం చేసుకోవాలని అధికార పార్టీ చూస్తున్నదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి, బద్వేలు ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లలేదని గుర్తుచేశారు. జగన్‌ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి తిరుపతిలో గెలిచారని.. అలాగే బద్వేలులోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమన్నారు. దమ్ముంటే టీఆర్‌ఎస్‌ కూడా అలా చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో 50 లక్షల సభ్యత్వాలు ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలే 40 శాతానికి పైగా ఉంటారని, వారిని ఓటు వేసేందుకు, జెండాలు మోసేందుకు మాత్రమే వీరిని ఉపయోగించుకుంటున్నారని జాజుల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు