ఫలితమొచ్చి వారం గడుస్తున్నా.. ఇంకా హాట్‌ టాపికే..

12 Nov, 2022 01:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు మూడు నెలల పాటు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా నిలిచిన ‘మునుగోడు’ వేడి ఇంకా చల్లారలేదు. ఉప ఎన్నిక ఫలితం వచ్చి వారం గడుస్తున్నా రాజకీయ వర్గాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ ఫలితం ఇచ్చిన సంకేతాలేంటి? త్రిముఖ పోటీ జరిగితే 2023 ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతోంది? అనే ఎన్నో ప్రశ్నలపై చర్చలు జరుగుతున్నాయి.

గేరు మార్చిన ‘కారు’ 
ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన రాజకీయ సమీకరణాల్లో కమ్యూనిస్టులతో టీఆర్‌ఎస్‌ దోస్తీ గురించే రాష్ట్రంలో ఎక్కువ చర్చ జరుగుతోంది. 2014లో తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాజకీయ రణరంగంలో తిరుగులేని శక్తిగా నిలిచిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు పొత్తు రాజకీయాలకు మునుగోడు నుంచే తొలి అడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలవాలన్న టీఆర్‌ఎస్‌ వ్యూహం సత్ఫలితాన్నే ఇచ్చినా.. ‘కారు’కు అదనపు బలం అవసరం పడుతోందనే చర్చకూ తావిచ్చిందని చర్చ జరుగుతోంది.

కోరి తెచ్చుకున్నా చేదు తీర్పు! 
మునుగోడు ఉప ఎన్నిక ద్వారా బీజేపీ దూకుడుకు బ్రేక్‌ పడిందనే చర్చ జరుగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిచి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మునుగోడు వేదికగా గోల్‌ కొట్టి ‘రాజ’సంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భావించింది. ఈ క్రమంలో కోరి తెచ్చుకున్న ఉప ఎన్నిక ఫలితం చేదు తీర్పు ఇచ్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్‌.. కోలుకునేదెప్పుడు? 
సిట్టింగ్‌ స్థానంలో పోటీచేసి.. మూడోస్థానానికి పడిపోయి, డిపాజిట్‌ను గల్లంతు చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీని ఈ ఉప ఎన్నిక సందిగ్ధంలోకి నెట్టింది. తమకు 23 వేలకు పైగా ఓట్లు రావడం, పార్టీని వీడి బీజేపీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి ఓడిపోవడంతో సంతోషించాలో.. సిట్టింగ్‌ నుంచి మూడోస్థానానికి పడిపోవడంపై బాధపడాలో అర్థంకాని పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్‌ ఇంకెప్పుడు కోలుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

చిన్నాచితకా పార్టీలు.. ఎప్పటిలాగే 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలు కూడా ఎంతోకొంత ప్రభావం చూపుతాయని మునుగోడు ఉప ఎన్నిక తేల్చిందనే చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీ జరిగితే ఫలితం ఎలా ఉంటుందన్నది ఈ ఉప ఎన్నికతో తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక..

మరిన్ని వార్తలు