పీఓకే అంశంలో నెహ్రూది హిమాలయమంతటి తప్పిదం: అమిత్ షా

6 Dec, 2023 17:05 IST|Sakshi

జమ్ము కశ్మీర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశంలో మాజీ ప్రధాని నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. పీవోకే సమస్యకు నెహ్రూదే బాధ్యత అంటూ నిప్పులు చెరిగారు. పీవోకే విషయంలో నెహ్రూ చేసింది చిన్న తప్పు కాదు.. హిమాలయమంతటి తప్పిదమని ధ్వజమెత్తారు.  దేశంలో చాలా భూభాగాన్ని నెహ్రూ వదిలివేశారని తప్పుబట్టారు. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగించారు. 

మాజీ ప్రధాని నెహ్రూ రెండు భారీ తప్పులు చేశారని షా అన్నారు. మొదటిది  కాల్పుల విరమణ చేయడం కాగా రెండోది.. మన అంతర్గత పీఓకే అంశాన్ని ఐరాసకు తీసుకువెళ్లి నెహ్రూ మరో తప్పిదం చేశారని అమిత్ షా చెప్పారు. అప్పట్లో కాల్పుల విరమణ మరో మూడు రోజులు చేయకుండా ఉంటే.. పీఓకే ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో భాగంగా ఉండేదని తెలిపారు. పీఓకే ఎప్పటికైనా భారత్‌దే అని షా పునరుద్ఘాటించారు. కాగా.. నెహ్రూ గురించి అమిత్ షా మాట్లాడుతుంటే.. సభ నుంచి కాంగ్రెస్ వాకౌంట్ చేసింది. 

ప్రస్తుతం పీఓకేకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నట్లు షా పేర్కొన్నారు. గతంలో జమ్మూలో 37 సీట్లు ఉండగా, ఇప్పుడు 43 ఉన్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో గతంలో 46 సీట్లు ఉండగా.. ప్రస్తుతం 47 స్థానాలు ఉన్నాయి. పీఓకేకు 24 సీట్లు కేటాయించామని అమిత్ షా స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి: పీఓకేపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు


 

>
మరిన్ని వార్తలు