రాష్ట్రంలో మార్పు తథ్యం.. టీఆర్‌ఎస్‌కు బీజేపీనే సరైన ప్రత్యామ్నాయం..

1 Oct, 2022 09:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీతో పొత్తు కుదుర్చుకునే ప్రస్తావనగానీ, ఈ అంశంపై ఎలాంటి చర్చగానీ పార్టీలో జరగలేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడ విలేకరులతో లక్ష్మణ్‌ చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. ఏపీలో జనసేన పార్టీతో పొత్తు ఉంటుందన్నారు. టీడీపీతో కలిసి ఉమ్మడిగా పొత్తు కుదుర్చుకుందామని ఒకవేళ జనసేన ప్రతిపాదిస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు అలాంటి ఆలోచన బీజేపీకి ఏమాత్రం లేదని చెప్పారు.

తెలంగాణలో ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్‌ రద్దు చేస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు రద్దు వరకు ఆయన చేతుల్లో ఉన్నా ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనేది ఈసీ నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో మార్పు తథ్యమని, టీఆర్‌ఎస్‌కు బీజేపీనే సరైన ప్రత్యామ్నాయమనే భావన ప్రజల్లో ఇప్పటికే ఏర్పడిందని, ముఖ్యంగా ఓబీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ముషీరాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలా వద్దా అనేదానిని పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ భారత్‌ జోడో అంటే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌ చోడో అంటున్నారని ఎద్దేవా చేశారు.
చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్‌–రేవంత్‌ల మాటల యుద్ధం

మరిన్ని వార్తలు