మమతవి శవ రాజకీయాలు

18 Apr, 2021 05:36 IST|Sakshi

ప్రధాని మోదీ ధ్వజం

తృణమూల్‌ ముక్కలు చెక్కలవుతోందని వ్యాఖ్య

అసన్‌సోల్‌/గంగారాంపూర్‌: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగు దశలు ముగిసేనాటికే తృణమూల్‌ పార్టీ దాదాపు ముక్కలు చెక్కలు అయిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇక ఎనిమిది దశల పోలింగ్‌ ప్రక్రియ ముగిసేనాటికి తృణమూల్‌ కథ ముగిసిపోతుందని, సీఎం మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ ఓటమి ఖాయమవుతుందని మోదీ జోస్యం చెప్పారు. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మోదీ రాష్ట్రంలో అసన్‌సోల్‌లో ప్రచార ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. సీతల్‌కూచీ ఘటనను మమత తనకు అనుకూలంగా మలుచుకున్నారని మోదీ ఆరోపించారు. ఆ ఐదుగురి మరణాలతో మమత శవ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆ తర్వాత మోదీ గంగారాంపూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. మమత సర్కార్‌లో అక్రమ బొగ్గు తవ్వకం జరిగిందంటూ నిప్పులుచెరిగారు.

Üున్నిత అంశమైన కూచ్‌ బెహార్‌లో కాల్పుల ఘటనపై మమత వ్యవహార శైలి ఎలాంటిదో ఆడియో క్లిప్‌ను వింటే అర్ధమైపోతుందని మోదీ ఆరోపించారు. కాల్పులు చనిపోయిన వారి మృతదేహాలతో భారీ ర్యాలీ చేపట్టాలని టీఎంసీ జిల్లా అధ్యక్షుడు, సీతల్‌కూచీ నుంచి పార్టీ అభ్యర్థి పార్థ ప్రతీమ్‌ రాయ్‌కు మమత ఫోన్‌ ఆదేశించినట్లుగా చెబుతున్న ఆడియో వివాదమవడం తెల్సిందే. ‘తన రాజకీయ స్వలాభం కోసం మమత ఎలాంటి శవ రాజకీయాలు చేస్తుందో.. ఆ ఆడియో టేప్‌ వింటే తెలుస్తుంది. ఆమెకు గతంలోనూ ఇలా శవ రాజకీయాలు చేశారు’ అని మోదీ ఆరోపించారు.  ‘కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, బెంగాల్‌ ప్రజలకు మధ్య మమత అడ్డుగోడలా నిలిచారు. పీఎం–కిసాన్, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాల ప్రతిఫలాలను బెంగాల్‌ ప్రజలకు దక్కకుండా మమత అడ్డుకున్నారు. నన్ను నిందించకుండా మమతది ఏ రోజూ గడవలేదు’ అని మోదీ అన్నారు.

మరిన్ని వార్తలు