టీఆర్ఎస్ పతనానికి గ్రేటర్ ఎన్నికలే నాంది

29 Nov, 2020 15:32 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వరదల్లో వంద మంది చనిపోతే, హోంమంత్రిగా పరామర్శ చేయలేదు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తారా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ నేతల ప్రవర్తన హైదరాబాద్ ప్రజలను అవమానపరిచేలా ఉందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ.. కరోనా వ్యాక్సిన్ పరిశీలన పేరుతో డ్రామా చేస్తున్నారని.. ఆయన రాకపోతే వ్యాక్సిన్ తయారు కాదా..?  అని ప్రశ్నించారు. (చదవండి: ఉత్తమ్‌కుమార్‌ మాటెత్తడానికే వణుకు..

‘‘ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా.. యూపీ సీఎం.. ఆయన రాష్ట్రంలో దళిత మహిళలపై దాడులు జరుగుతుంటే మిన్నకుండి పోయారు. రాష్ట్రం లో అవినీతి పాలన జరుగుతుంటే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి. కర్ణాటక ఎంపీ అడ్డగోలుగా మాట్లాడుతారు. యూపీ సీఎం వచ్చి హైదరాబాద్ పేరు మారుస్తామంటారు. మీరు ఎవరు ఆ మాట అనడానికి. బండి సంజయ్‌ది కరీంనగర్ కార్పొరేటర్ స్థాయి. హైదరాబాద్ గురించి మాట్లాడటానికి ఆయనకేం ఏం సంబంధం. కేంద్రం.. హైదరాబాద్‌కు ఏం చేసింది..? గ్రేటర్ అభివృద్ధి చేసిందంతా కాంగ్రెస్ హయాంలోనే. వరదలు వచ్చినప్పుడు కేంద్ర బలగాలు ఎందుకు రాలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం బలగాలను దింపుతారా.? పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? కేసీఆర్ తెలంగాణను ఏడేళ్ల పాటు దోచుకున్నారు. నిన్న సభలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లడలేదు. సభ అట్టర్‌ ఫ్లాప్‌. టీఆర్ఎస్ పతనానికి గ్రేటర్ ఎన్నికలే నాంది. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని’’  ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: మేమే నంబర్‌ వన్)‌

>
మరిన్ని వార్తలు