అంతా గందరగోళం.. థరూర్.. ఓ విఫల ప్రయత్నం.!

9 Oct, 2022 06:20 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఒకపట్టాన అర్థం కావు. అంతా తెలిసినట్టుగానే ఉంటుంది. మొత్తం గందరగోళంగా కనిపిస్తుంది. కాంగ్రెస్‌ చీఫ్ ఎన్నిక కూడా ప్రస్తుతం అలాగే తయారైంది. తమకిష్టుడైన ఖర్గేని హైకమాండ్ తరపున బరిలోకి దింపారు. మళ్ళీ ఎవరైనా పోటీ చేయవచ్చని కమ్మని కబుర్లు చెప్పారు. సోనియా, రాహుల్ మాటలు నమ్మిన శశిథరూర్ కూడా రంగంలోకి దిగారు. అయితే నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఏకగ్రీవం అయితేనే బాగుంటుందనే వాదన వినిపించారు.  హైకమాండ్ ఆశీస్సులతో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గేనే.. ఏకగ్రీవం అయితేనే మేలని శశిథరూర్‌కు చెప్పినట్లు తెలిపారు. అలా అనుకుప్పుడు ఎవరైనా పోటీ చేయవచ్చని ప్రకటనలు ఎందుకిచ్చినట్లు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఏకాకి!
ఏఐసీసీ అధ్యక్ష్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ హైదరాబాద్ వస్తే ఆయనను పట్టించుకున్న దిక్కే లేదు. హైకమాండ్‌ నిర్ణయించిన అభ్యర్థి ఖర్గేకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నందున తెలంగాణ పీసీసీ దాదాపుగా థరూర్‌కు సహాయ నిరాకరణ చేసింది. హైదరాబాద్ వచ్చిన శశిథరూర్ హోటల్ కే పరిమితం అయ్యారు. శశిథరూర్‌ను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరిద్దరు నేతలు రిసీవ్ చేసుకోగా.. రాష్ట్రంలోని ముఖ్య నేతలు ఎవరు రాకపోవడం చర్చకు దారితీసింది. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి రాష్ట్రానికి వస్తే ఆయనను రిసీవ్ చేసుకోకుండా టీపీసీసీ సహాయనిరాకరణ చేసింది. 

మాకు చెప్పలేదు మరీ.!
టీపీసీసీ ఇలా వ్యవహరించడానికి శశిథరూర్ ప్రధాన కారణమని పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నప్పుడు శశిథరూర్ కనీస సమాచారం ఇవ్వలేదని వీహెచ్ లాంటి నేతలు విమర్శిస్తున్నారు. ముందుగా సమాచారం ఇస్తే గాంధీ భవన్ లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేవాళ్ళమని ఓటర్ జాబితా ఇచ్చి ప్రచారానికి సహాకరించేవాళ్ళమని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఆయనది ఒంటరి దారే.!
ఇప్పటికే సీఏల్పీ నేత భట్టి విక్రమార్క తన మద్దతు ఖర్గేకేనని చెప్పారు. ఖర్గేకు మద్దతుగా వీహెచ్ చేసిన వాఖ్యలు చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ఓట్లు మొత్తం గంప గుత్తగా ఖర్గేకు పడే అవకాశం కనిపిస్తోంది. అయితే  ఎన్నికల్లో గెలిస్తే పార్టీ అధ్యక్షుడు అయ్యే శశిథరూర్ వచ్చినా టీ కాంగ్రెస్ నేతలు ఎవరు పట్టించుకోలేదు. తాను మాత్రం నేతలను వ్యక్తిగతంగా కలుస్తా అని  చెప్పినా అది వర్కవుట్ కాలేదు. పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి కి  ఫోన్ చేసినా ఇతర కార్యక్రమాలలో ఉన్నందున కలవలేకపోతున్నా అని శశిథరూర్ కి సమాధానం ఇచ్చారట. దీంతో ఎవరిని కలవకుండానే మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని విమానం ఎక్కేసారు శశిథరూర్. గతంలో థరూర్ చాలా సార్లు హైదరాబాద్ వచ్చినా పీసీసీ నేతలకు సమాచారం ఇవ్వకుండానే తన కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోయేవారట.

పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు తన అభ్యర్దిత్వాన్ని బలపరచాలని పీసీసీ డెలిగెట్స్ కు శశిథరూర్ విజ్ఞప్తి చేసారు. పీసీసీ లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, కొత్త వారికి నాయకత్వ భాధ్యతలతో పాటు మరికొన్ని అంశాలను శశిథరూర్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కోన్నారు. శశిథరూర్ ముందస్తు సమాచారం ఇవ్వకపోయినా.. టీ పీసీసీ ఎందుకు చొరవ తీసుకోలేదనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు