HYD: కుక్కల దాడి ఘటన.. వారికి మెదడు ఉందా?.. రేవంత్‌రెడ్డి సీరియస్‌

22 Feb, 2023 12:33 IST|Sakshi

సాక్షి, భూపాలపల్లి: కుక్కల బెడదపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కుక్కల బెడదను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో కుక్కల దాడిలో బాలుడు చనిపోతే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. హాథ్ సే హాథ్ జోడో  యాత్రలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న రేవంత్‌రెడ్డి.. కోటంచ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుక్కలకు ఆకలి వేసి బాలుడిని తిన్నాయని మేయర్ అంటే.. మంత్రి కేటిఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తామని చెప్పడం చూస్తే వారి ఆలోచన ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. చనిపోయిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాల్సిన మంత్రి కేటీఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామనడం వారికి మెదడు ఎక్కడ ఉందో అర్థమవుతుందన్నారు.

ఎఫ్1 రేస్‌పై ఉన్న శ్రద్ధ కుక్కల బెడదపై లేదా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తక్షణమే మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి, క్షమాపణ చెప్పి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బినామీల పేరుతో పేదల భూములను ఆక్రమించుకుంటున్నాడని ఆరోపించారు. రేపు భూపాలపల్లిలో పర్యటించే మంత్రి కేటీఆర్.. దానిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అక్రమ దందాను నిరూపించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
చదవండి: అందుకే నన్ను టార్గెట్‌ చేస్తున్నారు: చికోటి ప్రవీణ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

భూపాలపల్లికి పట్టిన చీడపీడ విరగడం కోసం కోటంచ లక్ష్మి నరసింహస్వామి వారిని వేడుకుని పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. భూపాలపల్లిలో ఆరాచకశక్తులు పార్టీ ఫిరాయింపుదారులు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. వారి తప్పిదాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర భూపాలపల్లిలో ఉందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనతో ఆస్తులు సంపాదనే లక్ష్యంగాఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పనిచేస్తున్నాడని విమర్శించారు. భూపాలపల్లిలో పర్యటించే కేటీఆర్ తమ సవాల్ స్వీకరించి సమాధానం చెప్పాలని కోరారు.

మరిన్ని వార్తలు