అవినీతి.. వైఫల్యాలు

7 Nov, 2023 01:57 IST|Sakshi
బీఆర్‌ఎస్‌పై బీజేపీ చార్జ్‌షీట్‌ విడుదల చేసిన ప్రకాశ్‌ జవదేకర్, కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, లక్ష్మణ్‌ తదితరులు

కేసీఆర్‌ కుటుంబం చేతిలో యావత్‌ తెలంగాణ బందీ

బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై బీజేపీ చార్జ్‌షిట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తొమ్మిదన్నరేళ్ల పాలనలో అవినీతి, అరాచకాలు, లోటుపాట్లు, వైఫల్యాలు ఇతర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై చార్జ్‌షీట్‌ను ప్రకటిస్తున్నట్టు బీజేపీ వెల్లడించింది. దేశంలోనే అవినీతికి, లంచగొండితనానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక ఉదాహరణగా మారిందని ధ్వజమెత్తింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం–అవినీతి అనేవి రెండూ పర్యాయ పదాలుగా మారిపోయాయని విమర్శించింది.

కాళేశ్వరంలో అవి నీతి ఎక్కడుందో చూపాలంటూ సవాళ్లు చేశారని, అయితే నిజం అనేది దాగదు కాబట్టి ఎన్నికలకు ముందు భగవంతుడే పిల్లర్ల కుంగుబాటు ద్వారా దానిని ప్రజల ఎదుట పెట్టాడని తెలిపింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై చార్జ్‌షిట్‌ను సోమ వారం బీజేపీ రాష్ట్ర శాఖఅధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ ప్రకాశ్‌ జవదేకర్, మేనిఫెస్టోకమిటీ చైర్మన్‌ పి.మురళీధర్‌రావు,  డా.కె.లక్ష్మణ్,  యెండల లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తేజావత్‌ రామచంద్రుడు, జయచంద్ర విడుదల చేశారు. దళితులకు దగా,  బీసీలకు ద్రోహం, విద్యారంగం ఆగం, వైద్యరంగంలో హామీల బుట్టదాఖలు, నిరుద్యోగులకు మోసం, విశ్వనగరం–విషాదనగరం.. ఇలా 31 అంశాల్లో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఈ చార్జ్‌షిట్‌లో బీజేపీ ప్రస్తావించింది. 

చార్జ్‌షీట్‌లో ముఖ్యాంశాలు... 
బీఆర్‌ఎస్‌ అవినీతి: 2014లో కేసీఆర్‌ సీఎం అయ్యాక అవినీతి విలయతాండవం. సీఎంతో సహా మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు. ఇసుక మాఫియా, గ్రానైట్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా, డ్రగ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియా, కాంట్రాక్ట్‌ మాఫియా.. వీటన్నింటిలోనూ బీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధాలు. 

  • మిషన్‌ భగీరథ అంతా అవినీతికంపే. మిషన్‌ కాకతీయ పేరుతో రూ. 30 వేల కోట్లలో అధిక సొమ్ము బీఆర్‌ఎస్‌ నాయకుల జేబులోకి పోయింది.  
  • కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి కంపు. ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి, అంచనాలు పెంచారు. రూ.40వేల కోట్ల రూపాయల అంచనాను రూ. లక్షా 40 వేల కోట్లకు పెంచి, సీఎంకుటంబసభ్యులే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు.  మేడిగడ్డ కూలిపోయే స్థితికి రావడం తెలంగాణ ప్రజల రక్తమాంసాలను తాగినట్టుగానే మేం భావిస్తున్నాం.  
  • సీఎం కూతురికే లిక్కర్‌ స్కాంతో సంబంధాలున్నాయి.  
  • ధరణి పోర్టల్‌ బీఆర్‌ఎస్‌ నాయకులకు పెద్ద ఆదాయవనరుగా మారింది. చెరువులు, కుంటలు, పార్కులు, దేవాలయ భూములు, అసైన్డ్‌ భూములు, కాందిశీకుల భూములు... ల్యాండ్‌ మాఫియాలో బీఆర్‌ఎస్‌ నిండా మునిగి ఉంది.  
  • అవినీతికి ఎవరు పాల్పడినా 040–23452933 నంబర్‌కు కాల్‌ చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్‌ చెప్పారు. కానీ ఆ నంబర్‌ అసలు మనుగడలోనే లేదు.   

రైతులకు మోసం: అప్పుల బాధతో తొమ్మిదిన్నరేళ్లలో 7,800 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినా బస్తా యూరియా కూడా ఇయ్యలే.  

నీటి పారుదల రంగం: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నా,  ఇంతవరకు కొత్త ఆయకట్టుకు నీరందింది లేదు. పాలమూరు– రంగారెడ్డి లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టును ఇంతవరకు పూర్తి చేయలేదు.  

దళితులకు దగా: దళితుడిని ముఖ్యమంత్రి చెయ్యలే, భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యలేదు 

గిరిజనులు : గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేయలేదు. పోడు భూములు పూర్తిగా ఇవ్వలేదు. 

బీసీలకు ద్రోహం: బీసీల సమగ్ర అభివృద్ధికి రూ.25 వేల కోట్లు, బీసీ కార్పొరేషన్‌కు ఏటా వెయ్యికోట్లు కేటాయిస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎంబీసీ కుల వర్గీకరణ చేయలేదు. 

విద్యారంగం ఆగం: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు హామీని నెరవేర్చలేదు. కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సౌకర్యాలతో ఈ–లైబ్రరీల నిర్మాణానికి ఇంతవరకు అతీగతి లేకుండా పోయింది.  ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా బోధనా సిబ్బందిని నియమించలేదు. 

మహిళలకు అన్యాయం: డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణాలిస్తామని ఇంతవరకు ఇచ్చింది లేదు. మహిళా కమిషన్‌ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి, కాగితాలకే పరిమితమైంది. మహిళలకు రక్షణ లేదు. 

నిరుద్యోగులకు మోసం : ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నడు, కనీసం ఊరికొక ఉద్యోగం కూడా ఇయ్యలే. పోలీసుశాఖలో తప్ప ఇతర శాఖలలో నియామకాలే లేవు. టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు తొమ్మిది సంవత్సరాల తర్వాత 2022లో ఇచ్చిండు. కానీ అది కూడా అనేక ఆరోపణలతో రెండుసార్లు రద్దు అయ్యింది. సర్కారు వైఖరితో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగులకు నెలకు 3016/– భృతి, జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు.  

విద్యుత్‌ రంగం: కొత్తగా 10 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. వేల రూపాయల బిల్లు వేస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలపై భారం వేసి ఆర్థికంగా ఇబ్బందులు చేశారు.   

పారిశ్రామిక రంగం: నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించలే. కార్మికులు, రైతులను అన్యాయం చేశారు. కాగజ్‌నగర్‌ నుంచి మణుగూరు వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తామని గాలిమాటలు చెప్పిండు.  
విశ్వనగరం కాదు... విషాద నగరం:  మూసీనదిని బ్యూటిఫికేషన్‌ చేసి, టూరిజం ప్లేస్‌ గా తీర్చిదిద్దుతామని వాగ్దానం చేసిండు. ఇంతవరకు కార్యరూపం  దాల్చలేదు. మూసీ మురికిపోలే, కంపుపోలే.  హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ జరగలేదు కానీ కబ్జాలు  జరుగుతున్నాయి.  

కార్మికులు:  కార్మికులకు అన్ని రంగాల్లోనూ తీవ్ర అన్యాయం చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తానన్న హామీ నెరవేర్చలేదు. 

తెలంగాణ ఉద్యమకారులు: అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు ఇవ్వలేదు. రూ. 10 లక్షలు ఇవ్వలేదు. ఉద్యమకారులకు గుర్తింపేలేదు, అమరవీరులకు విలువ లేదు. రాష్ట్రం కోసం పోరాడిన వారిని కూడా మోసం చేసిండు.  

జర్నలిస్టులు: జర్నలిస్టులకు ఇంటిస్థలాలు ఇవ్వకుండా దగా చేసిండు. జేఎన్‌జే సొసైటీకి 38 ఎకరాల స్థలాన్ని కోర్టు ఉత్తర్వులు వచి్చన తర్వాత కూడా బదలాయించలేదు.  

పరిపాలనాలోపాలు: ప్రజలకు అందుబాటులో లేని సీఎంగా కేసీఆర్‌ దేశంలోనే నంబర్‌ 1 స్థానంలో నిలిచిండు. కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం సీఎంని కలవరు. రాష్ట్ర పాలన మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ రావు, కవిత, సంతోష్‌ రావు ఆదేశాల ప్రకారమే నడుస్తోంది. కేసీఆర్‌ కుటుంబం చేతిలో యావత్‌ తెలంగాణ బందీ అయ్యింది.

అతివాదం, ఉగ్రవాదం ఊతమిచ్చే కుట్ర :బీజేపీ చార్జ్‌ షీట్‌  కమిటీ చైర్మన్‌ మురళీధర్‌రావు  
ప్రజల భద్రతకు ఒకప్పుడు నక్సలైట్ల తీవ్రవాదంతో ఎలాంటి ముప్పు ఉన్నదో, నేడు అతివాదం,  ఉగ్రవాదంతో అంతే ప్రమాదం ఉందని బీజేపీ నేత, పార్టీ చార్జ్‌షీట్‌ కమిటీ చైర్మన్‌ పి. మురళీధర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్‌ కారిడార్‌ను ఉగ్రవాదం, అతివాదం వైపు మళ్లించేందుకు (ర్యాడికలైజేషన్‌ ఆఫ్‌ ఇస్లాం) ప్రయత్నాలు జరుగుతున్నాయని  తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇక్కడ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అనేక సంఖ్యలో ఉన్నారని, ఈ విషయంలో ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ అలైన్మెంట్‌ కారణంగా సవాళ్లు ముందుకొస్తున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలనపై బీజేపీ అభియోగపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎఫ్‌ఐతో లింకులు ఇక్కడ బయటపడ్డాయని, ఎన్‌ఐఏ ఇక్కడకు వచ్చి కొందరిని అరెస్ట్‌ కూడా చేసిందని తెలిపారు. తెలంగాణ–మద్యం, హైదరాబాద్‌–డ్రగ్స్‌ అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు