నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు: పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

15 Dec, 2023 19:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం, తన కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అలాగే సాధారణ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్‌నూ అనుమతించాలని ఆదేశించారు.

ప్రజలతో పాటే తన కాన్వాయ్‌ ఉండేలా చూడాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించుకున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండానే తన కాన్వాయ్‌ను తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా అధికారులు ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది. 

సీఎంతో పాటు మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖుల పర్యటన సమయంలో ట్రాఫిక్‌ నిలిపివేత గురించి తెలిసిందే. ప్రత్యేకించి హైదరాబాద్‌లో అది మరీ నరకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

కొత్త కాన్వాయ్‌ వద్దు!
కాన్వాయ్‌ విషయంలోనూ ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు.  కొత్త కార్లు కొనుగోలు చేయకుండా.. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 15 నుంచి 9కి కుదించాలని ఆదేశించారు. అలాగే కాన్వాయ్‌లోనే ఉన్న అన్ని తెల్ల రంగు కార్లకు నల్ల రంగు వేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

>
మరిన్ని వార్తలు