తడారిన ఎడారి గొంతు వినండి!

26 Oct, 2023 02:07 IST|Sakshi

21 అసెంబ్లీ సెగ్మెంట్లలో 8.3 లక్షల మంది గల్ఫ్‌ ఓటర్లు

డిమాండ్ల సాధనకు గల్ఫ్‌ విడోస్‌తో పోటీ యోచనలో సంఘాలు

మరణించిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌

కామారెడ్డితోపాటు ఆరు స్థానాల్లో బరిలోకి దించాలని ఆలోచన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడికి కొత్త వ్యూహం  

సాక్షి ప్రతినిధి, కరీంనగర్, మోర్తాడ్‌ (బాల్కొండ) :  రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న గల్ఫ్‌ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధపడుతుతున్నారు. తమ సమస్యలు తీరాలంటే.. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి గల్ఫ్‌దేశాల్లో మరణించిన కుటుంబాల నుంచి ఒకరిని పోటీ చేయించాలని గల్ఫ్‌ ప్రవాసీ సంఘాలు నిర్ణయించాయి. ఇటీవల షార్జాలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో దాదాపుగా 32 నియోజకవర్గాల్లో దుబాయ్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా తదితర మధ్యప్రాచ్య దేశాల్లో పనిచేసి వచ్చిన ఓటర్లు ఉన్నారని ప్రవాసీ సంఘాలు చెబుతున్నాయి. వీరంతా తమ హక్కుల సాధనకు సంఘటితంగా మారి అసెంబ్లీ ఎన్నికలు వేదికగా తమ డిమాండ్లను తెలియజేసేందుకు సిద్ధమయ్యారు.

ఇందుకోసం కామారెడ్డి లేదా నిర్మల్‌ వంటి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. కామారెడ్డిలో 100 మంది విడోలతో, నిర్మల్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ స్థానాల్లో ఒక్కో విడోతో నామినేషన్‌ వేయించేలా కసరత్తులు ప్రారంభించారు. ఇందుకోసం అన్ని గల్ఫ్‌ కుటుంబాలతో వాట్సాప్‌ గ్రూపులు ప్రారంభించి వారిని సంసిద్ధం చేస్తున్నారు. 

హామీల కోసం  పట్టు.. 
గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన వారి సంఖ్య దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా అక్కడ కొంతకాలం పనిచేసి తిరిగి వచ్చిన వారి సంఖ్య కూడా 15 లక్షలకుపైగానే ఉంటుందని ప్రవాసీ సంఘాలు చెబుతున్నాయి. వీరి సంక్షేమానికి, పునరావాసానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని గల్ఫ్‌ ప్రవాసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో గల్ఫ్‌ దేశాల్లో వివిధ కారణాల వల్ల 1,800 మందికిపైగా వలస కారి్మకులు ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు మరణిస్తే.. రూ.5 లక్షల పరిహారం ఇస్తానన్న డిమాండ్‌ను ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలని ప్రవాసీ సంఘాలు కోరుతున్నాయి.  

యుద్ధభేరి మోగిస్తాం
కామారెడ్డిలో వందమంది మహిళలతో నామినేషన్‌ వేయిస్తాం 
కోరుట్ల: సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డిలో గల్ఫ్‌ బాధిత కుటుంబాల నుంచి వంద మంది మహిళలతో నామినేషన్లు వేయిస్తామని గల్ఫ్‌ జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు గుగ్గిల్ల రవిగౌడ్, సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ చెన్నమనేని శ్రీనివాస్‌రావు, మంద భీంరెడ్డి, బూత్కురి కాంత అన్నారు. గల్ఫ్‌ వలస కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలో పార్టీలు నిర్లక్ష్యం చూపుతున్నాయని ఆరోపించారు.

జగిత్యాల జిల్లా కోరుట్లలో గల్ఫ్‌ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఒక్క పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో ప్రవాసీ బోర్డు, గల్ఫ్‌ కార్మికులకు ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబాలను ఆదుకునే అంశాల ప్రస్తావన తేలేదన్నారు. సమావేశంలో గల్ఫ్‌ జేఏసీ ప్రతినిధులు అశోక్, మోహన్‌రెడ్డి, రవి, మారుతి, బీడీ  చెన్న విశ్వనాథం,  శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

వైఎస్‌ హయాంలోనే ఆర్థిక సాయం
ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పని చేసిన వైఎస్సార్‌ తన హయాంలో గల్ఫ్‌ వలస కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారు. అప్పట్లో 1000 మంది గల్ఫ్‌ మృతులకు రూ. లక్ష చొప్పున సాయం అందించారు. గల్ఫ్‌ దేశాలను వీడి ఇంటిబాట పట్టిన వలస కార్మికులకు ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా రాయితీ రుణాలను ఇప్పించారు. వైఎస్‌ తర్వాత పనిచేసిన సీఎంలు ఎవరూ కూడా గల్ఫ్‌ వలస కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోలేదు. ఎన్నికల సమయం కావడంతో గల్ఫ్‌ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. వలస కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు