ఆసక్తికర దృశ్యం: సలాం.. రామ్ రామ్

4 Feb, 2022 16:18 IST|Sakshi

అఖిలేశ్‌, ప్రియాంక పరస్పర అభివాదం

యూపీ ఎన్నికల ప్రచారంలో అరుదైన సీన్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పరస్పర అభివాద సన్నివేశం గురువారం ఆవిష్కృతమైంది. బులంద్‌శహర్‌లో జయంత్‌ చౌదరితో కలిసి అఖిలేశ్‌ ప్రచారం నిర్వహిస్తుండగా... ప్రియాంక కూడా తన వాహనశ్రేణితో అటువైపు వచ్చారు. దీంతో ముగ్గురు నేతలు పరస్పరం అభివాదం చేసుకున్నారు. అక్కడే ఉన్న సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు జెండాలు ఊపుతూ ఆనందోత్సాహాలతో ఈలలు వేశారు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటోను అఖిలేశ్‌.. వీడియోను ప్రియాంక ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. తొలి విడత పోలింగ్‌ ఫిబ్రవరి 10న జరగనుంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ)తో కలిసి సమాజ్‌వాదీ పార్టీ బరిలోకి దిగింది. అధికార బీజేపీకి, ఈ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని మొత్తం తన భుజాన వేసుకుని ప్రియాంక గాంధీ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్‌, ప్రియాంక ప్రధానంగా బీజేపీ లక్ష్యంగా చేసుకున్నారు. (క్లిక్‌: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం)

అయితే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఏడింటిని మాత్రమే గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 47 సీట్లతో సరిపెట్టుకుంది. 2012లో అఖిలేశ్‌ పార్టీ 224 సీట్లు సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని అఖిలేశ్‌ యాదవ్‌ ముందుగానే ప్రకటించారు. (క్లిక్‌: ఉత్తరప్రదేశ్‌లో తరతరాలుగా వీరిదే అధికారం!)

మరిన్ని వార్తలు