వరుణ్ గాంధీకి బీజేపీ ఝలక్‌.. ఎందుకంటే..?

7 Oct, 2021 17:19 IST|Sakshi

న్యూఢిల్లీ: వరుణ్ గాంధీకి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) షాక్‌ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో వరుణ్‌ గాంధీకి మొండిచేయి చూపింది. 80 సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. వరుణ్‌ గాంధీ సహా ఆయన తల్లి మేనకా గాంధీకి కూడా కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ.. సొంత పార్టీకి కంట్లో నలుసులా మారారు. మేనకా గాంధీ.. మధ్యప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ ఎంపీగా ఉన్నారు. 


అందుకే చోటు దక్కలేదా?

ఇటీవల కాలంలో మోదీ సర్కారు విధానాలను విమర్శిస్తూ వరుణ్‌ గట్టిగానే గళం విన్పిస్తున్నారు. ముఖ్యంగా రైతు చట్టాలు, ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటన నేపథ్యంలో ఆయన స్వరాన్ని మరింత పెంచారు. లఖీమ్‌పూర్‌ ఖేరీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై ఉద్దేశపూర్వకంగానే కారు ఎక్కించారని ఆరోపించారు. పోలీసులు తక్షణమే స్పందించి దోషులను అరెస్ట్‌ చేయాలన్నారు. హింసాకాండకు బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షించాలని తాజాగా డిమాండ్‌ చేశారు. అన్నదాతల రక్తం కళ్లజూసిన వారిని బోనెక్కించాలని ట్విటర్‌ వేదికగా నినదించారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో వరుణ్‌, మేనకా గాంధీలకు చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


జంబో కార్యవర్గం

బీజేపీ తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో సీనియర్‌ నాయకులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు. 80 మంది సాధారణ సభ్యులతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు(ఎక్స్ఆఫిషియో) సహా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, లెజిస్లేటివ్‌ పార్టీ నేతలు, మాజీ డిప్యూటీ సీఎం, జాతీయ అధికార ప్రతినిధి, నేషనల్‌ ఫ్రంట్‌ ప్రెసిడెంట్‌, స్టేట్‌ ఇన్‌చార్జి, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. (చదవండి: లఖీమ్‌పూర్‌ హింస.. సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా)


అమిత్‌ షా, రాజనాథ్‌ సింగ్‌, అశ్విని వైష్ణవ్‌, నిర్మలా సీతారామన్‌, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్‌, మాజీ మంత్రులు హర్షవర్థన్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, ఎంపీలు, సీనియర్‌ నేతలకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. బీజేపీ జాతీయ కార్యవర్గం వివిధ అంశాలపై చర్చిస్తుంది. పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. కోవిడ్ -19 సంక్షోభం కారణంగా జాతీయ కార్యవర్గ సమావేశం చాలా కాలంగా జరగలేదు.

మరిన్ని వార్తలు