గజ గజ.. | Sakshi
Sakshi News home page

గజ గజ..

Published Wed, Dec 6 2023 1:36 AM

- - Sakshi

మిచాంగ్‌

సాక్షిప్రతినిధి, ఒంగోలు: మిచాంగ్‌ తుఫాన్‌తో జిల్లా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. మూడు రోజులుగా తీవ్ర చలిగాలులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. సింగరాయకొండ మండలం పాకల పల్లెపాలెంలో సముద్రం సుమారు 50 అడుగులు ముందుకొచ్చింది. ఊళ్లపాలెం, పాకల పంచాయతీ చెల్లెమ్మగారి పట్టపుపాలెం సముద్రతీరంలో అలల ఉధృతితో బోట్లు ఒకదానికొకటి గుద్దుకుని పాక్షికంగా దెబ్బతిన్నాయని మత్స్యకారులు తెలిపారు. విషయం తెలుసుకున్న మత్స్యకారులు తమ బోట్లను ట్రాక్టర్ల సహకారంతో సురక్షితమైన చోట ఉంచుకున్నారు. పాకల, ఊళ్లపాలెం తీరప్రాంత గ్రామాలను సీఐ దాచేపల్లి రంగనాథ్‌ పర్యవేక్షించారు. కొత్తపట్నం తీరంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. రాకాసి అలలు ఎగసిపడడంతో సముద్రం ముందుకొచ్చింది. నీళ్లు రోడ్డున తాకడంతో బోట్లు, వలలు దెబ్బతినే పరిస్థితి నెలకొని ఉంది. తీరం వెంబడి పలు ప్రాంతాల్లో కోతకు గురైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అపమత్తమైంది. జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించింది. జిల్లా వ్యాప్తంగా 47 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్క ఒంగోలు నగరంలోనే 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగతా 31 పునరావాస కేంద్రాలు సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల్లో ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించింది. తీర ప్రాంతాల ప్రజలతో పాటు, ఒంగోలు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికాగర్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ పునరావాస కేంద్రాల పర్యవేక్షణ చేపట్టారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లకుండా నిరోధించారు. అధికారులు ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల వద్ద తీరం దాటడంతో అధికారులతో పాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

తుఫాన్‌ ప్రభావం జిల్లాలో సోమవారం ఒక మోస్తరుగా ఉన్నా.. మంగళవారం మాత్రం బలమైన ఈదురు గాలులు వీచటంతో విద్యుత్‌ వ్యవస్థకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ఒంగోలు విద్యుత్‌ డివిజన్‌లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఆ తరువాత స్థానంలో దర్శి విద్యుత్‌ సబ్‌ డివిజన్‌లో విద్యుత్‌ స్తంభాలు కూలిపోవటం, విద్యుత్‌ తీగలు తెగిపోవటం లాంటి నష్టాలు సంభవించాయి. జిల్లాలో అనేకచోట్ల చెట్లు పడిపోవటంతో పాటు అవి కరెంట్‌ స్తంభాల మీద పడి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు రోడ్ల మీద పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఒంగోలు నగరంలో కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఒంగోలు, దర్శి విద్యుత్‌ డివిజన్లలో భారీగా విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఒకవైపు తీవ్ర గాలులు, మరో వైపు భారీ వర్షం కురుస్తున్నా విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది యుద్ద ప్రాతిపదికన మరమ్మతుల పనులు చేపట్టారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో వెంటనే పునరుద్ధరించే కార్యక్రమాన్ని వేగంగా చేశారు.

జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు, ఈదురు గాలులు పలు ప్రాంతాల్లో కూలిన విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు నీటమునిగిన పంట పొలాలు ఒంగోలు నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు జిల్లాలో 47 పునరావాస కేంద్రాల ఏర్పాటు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆదిమూలపు సురేష్‌, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష తీరం దాటడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

Advertisement
Advertisement