WB Assembly Polls: ప్రధాని మోదీపై మమత ఘాటు వ్యాఖ్యలు

26 Mar, 2021 19:13 IST|Sakshi
పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(ఫైల్‌ ఫొటో)

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ సమీపించిన వేళ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. గడ్డాలు పెంచడం, స్టేడియాల పేర్లు మార్చడమే తప్ప పారిశ్రామిక అభివృద్ధి చేతకాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు శుక్రవారం నాటి ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘వారికి రెండు సిండికేట్లు ఉన్నాయి. ఒకరు.. ఢిల్లీ, గుజరాత్‌, యూపీలో అల్లర్లు చెలరేగేందుకు ప్రోత్సహిస్తారు.. ఇక మరొకరు పారిశ్రామిక అభివృద్ధిని కుంటుపడేలా చేసి గడ్డం పెంచుతూ ఉంటారు.

ఒక్కోసారి.. గాంధీజీ, రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ కంటే తానే గొప్ప వాడినని భావిస్తారు. మరోసారి తనను తాను స్వామి వివేకానంద అని చెప్పుకొంటారు. మైదానాలకు తన పేరు పెట్టుకుంటారు. ఏదో ఒకరోజు దేశానికే తన పేరు పెట్టుకుని, అమ్మేసినా అమ్మేస్తారు. నాకెందుకో వారి మెదడులోనే ఏదో సమస్య ఉందని అనిపిస్తుంది. బహుశా స్క్రూ లూజ్‌ అయి ఉంటుంది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా గతంలోనూ మమత ఇదే తరహాలో ప్రధాని మోదీని విమర్శించారు. ‘‘గుజరాత్‌లోని స్టేడియానికి ప్రధాన మంత్రి తన పేరు పెట్టుకున్నారు. కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లపై తన ఫొటోలు వేయించుకుంటున్నారు. అంతేకాదు తన ఛాయాచిత్రాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రోతో మాట్లాడారు. ఇలాగే చూస్తూ ఉంటే, దేశానికి తన పేరు పెట్టుకుంటారు’’ అని మండిపడ్డారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో 8 విడతలో​ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. మార్చి 27న తొలి విడత పోలింగ్‌ జరుగనుంది.

పోలింగ్‌ తేదీలు: 
►తొలి విడత: మార్చి 27
►రెండో విడత: ఏప్రిల్‌ 1
►మూడో విడత: ఏప్రిల్‌ 6
►నాలుగో విడత: ఏప్రిల్‌ 10
►ఐదో విడత: ఏప్రిల్‌ 17
►ఆరో విడత: ఏప్రిల్ 22
►ఏడో విడత: ఏప్రిల్ 26
►ఎనిమిదో విడత: ఏప్రిల్ 29

చదవండి: దొంగల రాజ్యానికి రాజులు

మరిన్ని వార్తలు